త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్‌లో ఫరోస్ జోరు..

Egypt Vs Australia | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల ఎట్టకేలకు సాకారమైంది. ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌ ఎట్టకేలకు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాను పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో మట్టికరిపించింది. తొలిసారిగా ప్రపంచకప్ ప్రీక్వార్టర్స్‌ (రౌండ్ ఆఫ్-16)లో అడుగుపెట్టింది.

P

Sports | Published On Jul 4, 2026, 7.47 am IST

Egypt vs Australia | పెనాల్టీ షూటౌట్‌లో ఫరోస్ జోరు..
Advertisement
  • ఆస్ట్రేలియాపై ఈజిప్ట్ సంచలన విజయం
  • తొలిసారి ప్రీక్వార్టర్స్‌లోకి ఫరోస్
  • ఒత్తిడిని తట్టులేక ఇంటిబాట పట్టిన ఆసిస్‌
  • రౌండ్‌ 16లో అర్జెంటీనాతో తలపడనున్న ఈజిప్ట్‌

Egypt Vs Australia | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల ఎట్టకేలకు సాకారమైంది. ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌ ఎట్టకేలకు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాను పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో మట్టికరిపించింది. తొలిసారిగా ప్రపంచకప్ ప్రీక్వార్టర్స్‌ (రౌండ్ ఆఫ్-16)లో అడుగుపెట్టింది. నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించాల్సి వచ్చింది. పెనాల్టీల్లో మహ్మద్‌ సాబెర్, రామీ రాబియా, మహ్మద్ సలాహ్, హొస్సామ్ అబ్దెల్‌మగీద్ ఎలాంటి తప్పులు చేయకుండా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. తొలి పెనాల్టీని హ్యారీ సౌటార్ బార్‌పై కొట్టగా.. నాలుగో ప్రయత్నంలో 18 ఏళ్ల లూకాస్ హెరింగ్టన్ షాట్ క్రాస్‌బార్‌ను తాకింది. దీంతో చివరి పెనాల్టీని అబ్దెల్‌మగీద్ విజయవంతంగా గోల్‌గా మలిచి ఈజిప్ట్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ప్రపంచకప్ నాకౌట్ దశలో ఈజిప్ట్ తొలిసారి విజయాన్ని అందుకుంది. రౌండ్‌ ఆఫ్‌ 16లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది.

మ్యాచ్ ఆరంభం నుంచే ఈజిప్ట్ ఆధిపత్యం చెలాయించింది. 13వ నిమిషంలో ఇమామ్ అషూర్ జట్టుకు తొలి గోల్ అందించాడు. మహ్మద్ సలాహ్ చాకచక్యంగా తీసిన ఫ్రీకిక్‌ను అషూర్ అందుకుని తొలి ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైనా.. తర్వాత కరీమ్ హఫెజ్ అందించిన అద్భుతమైన క్రాస్‌ను హెడ్డర్‌తో గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌ టోర్నీలో 250వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత కూడా ఈజిప్ట్ బంతిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వేగవంతమైన పాసింగ్‌తో ఆస్ట్రేలియా డిఫెన్స్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిభాగంలో ఆస్ట్రేలియా విఫలమైంది. సెకండాఫ్‌ ప్రారంభంలో ఒమర్ మార్మూష్‌కు లభించిన సువర్ణావకాశాన్ని ఈజిప్ట్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హానీ ప్రత్యర్థి ఆటగాడు కానర్ మెట్కాఫ్‌తో ఢీకొని కొద్దిసేపు మైదానంలోనే కదలకుండా పడిపోయాడు. వైద్య సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి స్ట్రెచర్‌ను సిద్ధం చేయగా.. చికిత్స తీసుకొని మళ్లీ హానీ ఆటను కొనసాగించాడు. అయితే, ఐదు నిమిషాలకే అతన్ని దురదృష్టం వెంటాడింది. ఏడెన్ ఓ'నీల్ ఇచ్చిన ప్రమాదకరమైన ఫ్రీకిక్‌ను క్లియర్ చేయబోయిన హానీ హెడ్డర్ అనుకోకుండా సొంత గోల్‌పోస్ట్‌లోకే వెళ్లింది. దీంతో స్కోర్‌ సమమైంది. దాంతో హాని ఓన్‌ గోల్‌ చేసిన ఆటగాడిగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ప్రపంచకప్‌లో రెండు సెల్ఫ్ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గ్రూప్ దశలోనూ అతని ఖాతాలో ఓన్‌ గోల్ వేశాడు. స్కోరు సమం చేసిన తర్వాత ఆస్ట్రేలియా మరింత ఉత్సాహంగా ఆడినా.. నిర్ణీత సమయంలో ఏ జట్టూ విజయం సాధించలేకపోయింది.

బీచ్ పోరాటం వృథా

అదనపు సమయంలో ఈజిప్ట్ మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. వరుస ఎటాక్‌తో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలో కేవలం తన ఆరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న గోల్‌కీపర్ ప్యాట్రిక్ బీచ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంజ్యూరీ టైమ్‌లో రామీ రాబియా హెడ్డర్‌ను ఒక చేత్తో అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం సలాహ్ కార్నర్ నుంచి వచ్చిన ప్రయత్నాన్నీ సమర్థంగా నిలువరించాడు. బీచ్ అద్భుత సేవ్‌లతో మ్యాచ్ పెనాల్టీలకు చేరినా.. ఆస్ట్రేలియా కోచ్ టోనీ పోపోవిచ్ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. షూటౌట్‌కు ముందు బీచ్‌ను తప్పించి సీనియర్‌ మాథ్యూ ర్యాన్‌ను బరిలోకి దింపాడు. టోర్నీలో అప్పటివరకు ఒక్క నిమిషం కూడా ఆడని ర్యాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్న కోచ్ అంచనా పూర్తిగా తలకిందులైంది. పెనాల్టీ షూటౌట్‌లో ఈజిప్ట్ ఏమాత్రం తడబాటులేకుండా ఆడడం విశేషం. ఆస్ట్రేలియా తొలి ప్రయత్నంలోనే హ్యారీ సౌటార్ పెనాల్టీని బార్‌పైకి పంపడంతో ఈజిప్ట్‌కు పైచేయి లభించింది. మహ్మద్‌ సాబెర్ తొలి పెనాల్టీని గోల్‌గా మలచగా.. రామీ రాబియా ఆధిక్యాన్ని పెంచాడు.

అనంతరం మహ్మద్ సలాహ్ తనదైన శైలిలో పనేంకా షాట్‌తో బంతిని నేరుగా గోల్ మధ్యలోకి పంపాడు. ర్యాన్ ఎడమవైపు డైవ్ చేయగా.. సలాహ్ కూల్‌గా కొట్టిన ఆ పెనాల్టీ ఈజిప్ట్ ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టింది. జాక్సన్ ఇర్విన్, అవర్ మాబిల్ ఆస్ట్రేలియా తరఫున గోల్స్ చేసినా.. నాలుగో ప్రయత్నంలో లూకాస్ హెరింగ్టన్ షాట్ క్రాస్‌బార్‌ను తాకడంతో మ్యాచ్ పూర్తిగా ఈజిప్ట్ వైపు మళ్లింది. చివరి పెనాల్టీని హొస్సామ్ అబ్దెల్‌మగీద్ ధైర్యంగా గోల్‌గా మలచడంతో ఈజిప్ట్ ప్లేయర్స్‌, అభిమానుల సంబరాలకు అవధులు లేకుండా పోయాయి. పెనాల్టీల కోసం ప్రత్యేకంగా బరిలోకి దిగిన మాథ్యూ ర్యాన్ ఒక్క షాట్‌నూ అడ్డుకోలేకపోయాడు. మరోవైపు అద్భుత ప్రదర్శన చేసిన ప్యాట్రిక్ బీచ్ మాత్రం సైడ్‌లైన్ నుంచి నిస్సహాయంగా చూస్తూ మిగిలిపోయాడు. అయితే, ఈజిప్ట్‌కు ఇవేమీ పెద్ద విషయం కాదు. ఎన్నో దశాబ్దాలుగా వెంటాడిన ప్రపంచకప్ నిరాశకు తెరదించుతూ ఫరోస్ తొలిసారి నాకౌట్ దశలో విజయం సాధించింది. ఇప్పుడు ప్రీక్వార్టర్స్‌లో మరో పెద్ద సవాల్‌కు సిద్ధమవుతోంది.

Advertisement
Advertisement