త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinmay Sutar | రంజీ ట్రోఫీలో చరిత్ర.. 400 పరుగులతో చిన్మయ్ సుతార్ సంచలనం!

Chinmay Sutar | భారత దేశవాళీ క్రికెట్‌లో మరో చారిత్రక ఇన్నింగ్స్ నమోదైంది. రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) అరుదైన ఘనత సాధించాడు. నాగాలాండ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అజేయంగా 400 పరుగులు చేసి రికార్డులకెక్కాడు. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. దాదాపు 78 ఏళ్ల తర్వాత ఈ ఘనత పునరావృతమైంది.

P

Sports | Published On Oct 19, 2026, 5.36 pm IST

Chinmay Sutar | రంజీ ట్రోఫీలో చరిత్ర.. 400 పరుగులతో చిన్మయ్ సుతార్ సంచలనం!
Advertisement
  • 78 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత
  • 46 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 400
  • రంజీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో రెండో స్థానం

Chinmay Sutar | భారత దేశవాళీ క్రికెట్‌లో మరో చారిత్రక ఇన్నింగ్స్ నమోదైంది. రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) అరుదైన ఘనత సాధించాడు. నాగాలాండ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అజేయంగా 400 పరుగులు చేసి రికార్డులకెక్కాడు. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. దాదాపు 78 ఏళ్ల తర్వాత ఈ ఘనత పునరావృతమైంది.

నింబాల్కర్‌దే అగ్రస్థానం

రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మహారాష్ట్రకు చెందిన బీబీ నింబాల్కర్‌ పేరిట ఉంది. 1948-49 సీజన్‌లో కాఠియావార్‌పై ఆయన అజేయంగా 443 పరుగులు చేశాడు. తాజాగా 400 పరుగులతో చిన్మయ్ సుతార్ ఈ జాబితాలో రెండో స్థానానికి చేరాడు. గతంలో ముంబై తరఫున అసోంపై 379 పరుగులు చేసిన పృథ్వీ షా రికార్డును అధిగమించాడు. 1990-91లో హైదరాబాద్‌పై ముంబై బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన 366 పరుగులు నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంవీ శ్రీధర్ 1993-94లో ఆంధ్రప్రదేశ్‌పై చేసిన 344 పరుగులు ఐదో అత్యధిక స్కోరుగా కొనసాగుతున్నాయి.

155వ ఓవర్‌లో 400 మార్క్‌

దిమాపూర్‌లోని సోవిమాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరం తొలి ఇన్నింగ్స్‌ను 581/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇందులో సుతార్‌దే ప్రధాన పాత్ర. 46 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 400 పరుగులు చేశాడు. వికెట్లు పడుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న అతడు, టీ విరామ సమయానికి 392 పరుగులతో ఉన్నాడు. అనంతరం 155వ ఓవర్‌లో 400 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సుతార్ ఇన్నింగ్స్‌లో మరో విశేషం పదో వికెట్‌కు నమోదైన భారీ భాగస్వామ్యం. లాల్‌రెంపునియా చక్‌చువాక్‌తో కలిసి అతడు అజేయంగా 190 పరుగులు జోడించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో చివరి వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది మూడోది. 1991-92 సీజన్‌లో ముంబైపై ఢిల్లీ ఆటగాళ్లు అజయ్ శర్మ, మనీందర్ సింగ్ 233 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. మిజోరం తరఫున జెహు ఆండర్సన్ 69 పరుగులు చేశాడు.

ముంబ‌యి నుంచి మిజోరంకు..

29 ఏళ్ల సుతార్ క్రికెట్ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ఈ ఏడాది జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రతో మ్యాచ్‌లో ముంబై తరఫున లిస్ట్‌-ఏ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు పరుగులకే రనౌటయ్యాడు. అనంతరం ముంబై టీ20 లీగ్‌లో సత్తా చాటాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 212 పరుగులు చేసి, తన జట్టు ఎంఎస్‌సీ మరాఠా రాయల్స్ టైటిల్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2026-27 సీజన్‌కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకుని మిజోరం జట్టులో చేరాడు. మణిపూర్‌తో మిజోరం తరఫున తొలి రంజీ మ్యాచ్‌లో 35, 99 పరుగులు చేశాడు. తాజాగా నాగాలాండ్‌పై ఏకంగా 400 పరుగులు చేసి దేశవాళీ క్రికెట్‌లో తన పేరును చరిత్రలో నిలిపాడు.

Advertisement
Advertisement