త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women’s Reservation Bill 2026 | రాజకీయ వాసన వస్తోంది.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బిల్లులో రాజకీయ కోణం దాగి ఉందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌-కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత రూపంలో ఉన్న ఈ బిల్లులను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

J

National | Published On Apr 16, 2026, 6.49 pm IST

Women’s Reservation Bill 2026 | రాజకీయ వాసన వస్తోంది.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Women's Reservation Bill 2026 | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్‌లో జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో (ఏప్రిల్ 16-18) 'మహిళా రిజర్వేషన్ బిల్లు' (నారీ శక్తి వందన్ అధినియం)పై వాడివేడి చర్చ జరుగుతోంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. 251 మంది సభ్యులు ఈ బిల్లుల ప్రవేశపెట్టడానికి అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మహిళలను విధాన నిర్ణయాల్లోకి తీసుకురావడానికి ఇదొక కీలక అవకాశమని, దీన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నాయని ఆయన హెచ్చరించారు. అయితే, లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ప్రధాని వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.

మహిళా రిజర్వేషన్ల ప్రాథమిక సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థిస్తుందని, అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లులో తీవ్రమైన "రాజకీయ వాసన" వస్తోందని ప్రియాంకా గాంధీ విమర్శించారు. ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల అమలు పట్ల స్పష్టత ఇవ్వకుండా గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. పదే పదే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మహిళలు సులభంగా పసిగడతారని, మహిళా ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యవంతులని ఆమె ట్రెజరీ బెంచ్‌లను హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ అనేది వారి హక్కు అని, అది ఎవరి దయాదాక్షిణ్యం కాదని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌-కోటా ఇవ్వాలి

ప్రభుత్వం ప్రతిపాదించిన 33% రిజర్వేషన్‌లోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలకు 'సబ్‌-కోటా' (ఉప కోటా) కల్పించాలని ప్రియాంకా గాంధీ గట్టిగా డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం ఉంటే దీనిని తక్షణమే అమలు చేయవచ్చని సూచించారు. అనవసరంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) వంటి ప్రక్రియలతో దీనిని ముడిపెట్టడం వల్ల, మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా బిల్లును విస్తృతంగా ఆమోదించాలన్నారు.

క్రెడిట్ అంతా బీజేపీదే అన్నట్లు ప్రధాని మాటలు

సభలో ప్రధాని మోదీ ప్రసంగం పూర్తి వాస్తవాలను ప్రతిబింబించలేదని ప్రియాంక ఆరోపించారు. క్రెడిట్ తీసుకోనని చెబుతూనే, మహిళా బిల్లుకు బీజేపీ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నట్లు ఆయన అసంపూర్ణ చరిత్రను సభ ముందు ఉంచారని విమర్శించారు. 2019లోనే రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆ ఘనత రాజీవ్ గాంధీ, కాంగ్రెస్‌దే

మహిళా ప్రాతినిధ్యం వెనుక ఉన్న కాంగ్రెస్ చరిత్రను ప్రియాంక సభలో ప్రస్తావించారు.

1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికలోనే మహిళల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉందని గుర్తుచేశారు.

1931 కరాచీ కాంగ్రెస్ సమావేశాలు సమాన హక్కుల సూత్రాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. అమెరికా లాంటి దేశాల కంటే ముందే భారతదేశం మహిళలకు ఓటు హక్కు కల్పించిందని ఆమె పేర్కొన్నారు.

స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలలో మహిళలకు 33% రిజర్వేషన్లను తొలిసారిగా ప్రవేశపెట్టింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో వేసిన పునాదే, నేడు జాతీయ స్థాయిలో బిల్లుపై చర్చ జరిగే స్థాయికి చేరిందని ఆమె వివరించారు.

ప్రభుత్వానికి మహిళల పట్ల నిజమైన గౌరవం ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదని హితవు పలికారు. ప్రస్తుత రూపంలో ఉన్న ఈ మూడు బిల్లులను తాము వ్యతిరేకిస్తున్నట్లు (Opposes the bills in current form) ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. బయట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతుండగా, సభ లోపల ఇండియా (INDIA) కూటమి నేతలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయేకు 292, ప్రతిపక్షాలకు 233 స్థానాలు ఉన్న నేపథ్యంలో సభలో మూడింట రెండొంతుల మెజారిటీ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement