త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!

Indian Navy | మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా భారత నౌకాదళాన్ని అత్యాధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తున్నట్లు నౌకాదళ ఉపాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అజయ్‌ కొచ్చర్‌ తెలిపారు. గగనతలం, సముద్రం, సముద్ర గర్భంలో కార్యకలాపాలతోపాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

P

National | Published On Oct 19, 2026, 5.55 pm IST

Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!
Advertisement
  • గగనతలం నుంచి సముద్ర గర్భం వరకు సాంకేతిక విస్తరణ
  • భవిష్యత్ యుద్ధాల్లో స్వయంచాలక వ్యవస్థలదే కీలక పాత్ర
  • పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన నౌకాదళ కార్యకలాపాలు

Indian Navy | మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా భారత నౌకాదళాన్ని అత్యాధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తున్నట్లు నౌకాదళ ఉపాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అజయ్‌ కొచ్చర్‌ తెలిపారు. గగనతలం, సముద్రం, సముద్ర గర్భంలో కార్యకలాపాలతోపాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. నెట్‌వర్క్‌ ఆధారిత బహుముఖ సైనిక శక్తిగా నేవీని తీర్చిదిద్దడమే లక్ష్యమని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇటీవలి అంతర్జాతీయ ఘర్షణలు యుద్ధ రంగంలో సాంకేతికత ప్రాధాన్యాన్ని చాటుతున్నాయని కొచ్చర్‌ చెప్పారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటిక్‌ వ్యవస్థలు (ఆటానమస్‌ సిస్టమ్స్‌), ఏఐ వినియోగంపై నేవీ దృష్టి సారిస్తోందన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థలను ఎదుర్కొనే కౌంటర్‌-యూఏఎస్‌ టెక్నాలజీ, క్వాంటం సాంకేతికత కూడా భవిష్యత్‌ సన్నద్ధతలో కీలకమని వివరించారు. ఈ రంగాలు రానున్న కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, సముద్ర మార్గాల భద్రతపై స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభంతో నౌకాదళ కార్యకలాపాలు పెరిగాయని కొచ్చర్‌ తెలిపారు. కీలక సముద్ర మార్గాలపై దాడుల నేపథ్యంలో భారత నౌకలు సురక్షితంగా తీరానికి చేరేందుకు ‘ఆపరేషన్‌ ఊర్జా సురక్ష’ దోహదపడిందని చెప్పారు.

యుద్ధాలు, ఘర్షణలే నౌకాదళ భవిష్యత్‌ దిశను నిర్ణయించవని కొచ్చర్‌ స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం, కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడమే కాకుండా, వాటి ద్వారా నౌకాదళ కార్యకలాపాలు మరింత సమర్థంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement