త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

NDA | సర్( SIR ) ప్రక్రియపై, ఎన్నికల కమిషన్ సీఈసీ( CEC ) పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. అధికార ఎన్డీఏ( NDA ) మాత్రం డీలిమిటేషన్( Delimitation ), మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదంపై తమ దృష్టిని సారించింది. గత ఏప్రిల్ నెలలో మూడింట రెండో వంతు మెజారిటీ లేకపోవడంతో నిలిచిపోయిన ఈ బిల్లులను తిరిగి ఆమోదింపజేసుకుంటామనే గట్టి నమ్మకంతో.. నెలాఖరులో కేంద్ర సర్కారు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు( Parliament Sessions ) ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

S

National | Published On Oct 16, 2026, 6.49 pm IST

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
Advertisement

శరద్ పవార్ ఎన్సీపీ కూడా
లోపాయికారి మద్దతు?
డీలిమిటేషన్, మహిళా బిల్లుల కోసం
పార్టీలతో బీజేపీ చర్చలు
బిల్లు ఆమోదంపై ..ఎన్డీఏ సంపూర్ణ విశ్వాసం
చీలిన పార్టీల సభ్యుల అండతో
లోక్‌స‌భ, రాజ్యసభల్లో పెరిగిన ఎన్డీఏ బలం
ఈ నెలాఖరులో ప్రత్యేక సమావేశాల కోసం యోచన
ప్రతిపక్షాలతో చర్చించకుండా
బిల్లు పెడితే భంగపాటు తప్పదన్న ఖర్గే

NDA | త్రినేత్ర న్యూస్: సర్( SIR ) ప్రక్రియపై, ఎన్నికల కమిషన్ సీఈసీ( CEC ) పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. అధికార ఎన్డీఏ( NDA ) మాత్రం డీలిమిటేషన్( Delimitation ), మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదంపై తమ దృష్టిని సారించింది. గత ఏప్రిల్ నెలలో మూడింట రెండో వంతు మెజారిటీ లేకపోవడంతో నిలిచిపోయిన ఈ బిల్లులను తిరిగి ఆమోదింపజేసుకుంటామనే గట్టి నమ్మకంతో.. నెలాఖరులో కేంద్ర సర్కారు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు( Parliament Sessions ) ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

బిల్లుకు మద్దతుగా.. డీఎంకే, ఎన్సీపీ

డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్‌ను జోడిస్తూ గత ఏప్రిల్ నెలలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు.. విపక్షాల మద్దతు లేక వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరిగి 4 నెలల తర్వాత ఈ బిల్లుపై చర్చ కోసం నెలాఖరులో పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారని ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం లోక్‌స‌భ‌లో 540 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం అవసరమైన బలం 360. అయితే అటు తృణమూల్ పార్టీ, శివసేన పార్టీ నుంచి చీలి ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు పలికిన తర్వాత.. ప్రస్తుతం ఎన్డీఏ బలం కేవలం 318 మాత్రమే. కాగా... తమిళనాడులో విజయ్ ప్రభుత్వంతో కాంగ్రెస్ జత కట్టిన నేపథ్యంలో.. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ప్రస్తుతం ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకొని.. డీలిమిటేషన్ బిల్లు విషయంలో డీఎంకేను ఎన్డీఏ ముఖ్యులు ఒప్పిస్తున్నట్టు సమాచారం. మరోవైపు శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీకి చెందిన 8 మంది ఎంపీలు కూడా మద్దతు ఇవ్వనున్నట్టు పార్టీ నేత సుప్రియా సూలే ఎన్డీఏ ముఖ్యులతో చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో.. మూడింట రెండొంతుల బలానికి కాస్త దూరంలో ఉండిపోయిన ఎన్డీఏ.. బిల్లు ఆమోదంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్టు సమాచారం.

మళ్లీ భంగపడకండి: ఖర్గే

కాగా.. రెండు నెలల నుంచి పార్లమెంట్ ప్రోరోగ్ చేయకుండా ఉండడంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు నిరవధిక వాయిదా తర్వాత దానిని అధికారికంగా ముగించడానికి జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించారు. సమావేశాలు ముగిసి 64 రోజులు గడిచినా ఉభయ సభలను ప్రోరోగ్ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఏప్రిల్ 17న స‌భ‌లో వీగిపోయిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే గుర్తు చేశారు. గ‌త సెష‌న్‌లోలాగానే ఈ బిల్లును మ‌ళ్లీ బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టే ముందు.. సవరించిన ప్రతిపాదనలపై చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల అనుమానాలు తీర్చకుండా బలవంతంగా బిల్లును రుద్దాలని చూస్తే భంగపడిపోతారని ఈ సందర్భంగా ఖర్గే.. హెచ్చరించారు.

Advertisement
Advertisement