త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

France Protests 2026 | భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది

ఫ్రాన్స్‌లో 8 లక్షల మంది రోడ్డెక్కడంతో పారిస్ సహా ప్రధాన నగరాలు అగ్నిగుండంగా మారాయి. రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకున్న 143 ఏళ్ల భవనాన్ని ఎందుకు తగలబెట్టారో తెలుసుకుందాం రండి.

J

International | Published On Oct 18, 2026, 7.00 pm IST

France Protests 2026 | భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది

సంక్షిప్త సారాంశం

ఫ్రాన్స్‌లో పెరిగిన ధరలు, పాఠశాలల్లో సమస్యలపై శనివారం 5.5 లక్షల నుంచి 8 లక్షల మంది రోడ్డెక్కడంతో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల నాటి లిమోజెస్ టౌన్ హాల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో భవనం పైకప్పు, క్లాక్ టవర్ కూలిపోయాయి. సీసీ కెమెరాలు ఆపేసి యాపిల్, లూయిస్ విట్టన్, హెర్మిస్ వంటి లగ్జరీ షోరూమ్‌లను దోచుకున్న ముఠాలు. 1,200 మంది అరెస్ట్, 150 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఫ్రాన్స్ అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేయగా, విధ్వంసకారులను కఠినంగా శిక్షిస్తామని అధ్యక్షుడు మాక్రాన్ హెచ్చరించారు.

Advertisement
  • అగ్నిగుండంగా ఫ్రాన్స్ 
  • రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకున్న 143 ఏళ్ల లిమోజెస్ టౌన్ హాల్‌కు నిప్పు
  • రణరంగంగా మారిన పారిస్, ప్రముఖ నగరాలు
  • సీసీ కెమెరాలు ఆపేసి యాపిల్, లూయిస్ విట్టన్ షోరూమ్‌ల దోపిడీ
  • గ్రెనేడ్ పేలి యువకుడి చెయ్యి ఛిద్రం
  • 1,200 మంది అరెస్ట్, 150 మంది పోలీసులకు గాయాలు
  • అరాచకవాదులను వదలబోమన్న మాక్రాన్

ధరల మంట, విద్యావ్యవస్థ దుస్థితిపై ఫ్రాన్స్‌లో రాజుకున్న నిరసన జ్వాలలు శనివారం రాత్రికి పెను విస్ఫోటనంగా మారాయి. దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి 8 లక్షల మంది ప్రజలు, విద్యార్థులు, కార్మికులు వీధుల్లోకి వచ్చి కదం తొక్కడంతో ఫ్రాన్స్ అట్టుడికిపోయింది. రాజధాని పారిస్ సహా ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో వీధులన్నీ రణరంగాన్ని తలపించాయి. లిమోజెస్ నగరంలో రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల నాటి చారిత్రక మున్సిపల్ భవనానికి (టౌన్ హాల్) నిరసనకారులు నిప్పు పెట్టడంతో దాని ప్రఖ్యాత క్లాక్ టవర్, పైకప్పు కుప్పకూలిపోయాయి.

France Protests 2026 | త్రినేత్ర న్యూస్ : శాంతియుత ర్యాలీలుగా మొదలైన ప్రదర్శనలు చీకటి పడేసరికి తీవ్ర హింసాత్మకంగా మారాయి. పారిస్‌లోని 'ప్లేస్ డె లా రిపబ్లిక్' వద్ద ఆందోళనకారులు వందలాది కార్లను తగులబెట్టి.. పోలీసులపై రాళ్లు, బాణసంచాతో విరుచుకుపడ్డారు. ముసుగులు, చేతి తొడుగులు ధరించిన యువకుల ముఠాలు పక్కా ప్రణాళికతో సీసీ కెమెరాల కనెక్షన్లు కట్ చేసి.. లిల్లేలోని యాపిల్ స్టోర్, బోర్డోలోని లూయిస్ విట్టన్, మార్సెయిలోని హెర్మిస్ వంటి లగ్జరీ షోరూమ్‌లను, సూపర్ మార్కెట్లను దోచుకున్నాయి. లియోన్‌లో చారిత్రక టూరిజం కార్యాలయాన్ని తగలబెట్టగా, గ్రెనోబుల్‌లో నిరసనకారులు ఏకంగా ఓ టూరిస్ట్ రైలును హైజాక్ చేసి పోలీసులపైకి నడిపారు. సెయింట్-ఎటియెన్ నగరంలో గ్రెనేడ్ పేలి 17 ఏళ్ల బాలుడి కుడి చెయ్యి తెగిపడింది. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 150 మందికి పైగా పోలీసులు గాయపడగా, 1,200 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను వెల్లడించారు. ప్రభుత్వ భవనాలు, టౌన్ హాళ్లను తగలబెట్టిన 'అరాచకవాదులను' కఠినంగా శిక్షిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు.

France in Flames 143-Year-Old Limoges Town Hall Torched Luxury Stores Looted as 8 Lakh Protest

తరగతి గది నుంచి వీధి పోరాటం దాకా.. ఫ్రాన్స్ ఆగ్రహ జ్వాలల వెనుక అసలు కథేంటి?

ఒకప్పుడు ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పాఠాలు నేర్పిన ఫ్రాన్స్.. ఇప్పుడు మరోసారి 1789 నాటి 'ఫ్రెంచ్ విప్లవం' తరహా నినాదాలతో దద్దరిల్లుతోంది. కేవలం ఒక చిన్న శివారు ప్రాంతంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై మొదలైన విద్యార్థుల నిరసన.. నెల రోజుల్లోనే దేశాన్ని స్తంభింపజేసే మహా ఉద్యమంగా ఎలా మారింది? ఆర్థిక సంక్షోభం, పెరిగిన జీవన వ్యయం, 2027 అధ్యక్ష ఎన్నికల రాజకీయాలు ఈ అల్లర్లకు ఆజ్యం పోశాయి.

France in Flames 143-Year-Old Limoges Town Hall Torched Luxury Stores Looted as 8 Lakh Protest

సెప్టెంబర్‌లో మొదలైన నిప్పురవ్వ.. పాఠశాలల దిగ్బంధం

ఈ ఆందోళనల మూలాలు గత నెల (సెప్టెంబర్) మధ్యలో పారిస్ శివారులోని క్రెటెయిల్ ప్రాంతంలో ఉన్న 'లైసీ సెయింట్-ఎక్సుపెరీ' ప్రభుత్వ పాఠశాలలో మొదలయ్యాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కిక్కిరిసిన తరగతి గదులు, వేసవి ఉక్కపోతను తట్టుకోలేని శిథిలావస్థ భవనాలు, విద్యావ్యవస్థలో అసమానతలపై 15 నుంచి 18 ఏళ్ల హైస్కూల్ విద్యార్థులు గళమెత్తారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం దావానలంలా వ్యాపించి, సెప్టెంబర్ 30 నాటికి 400కు పైగా పాఠశాలలకు పాకింది. చెత్త డబ్బాలతో స్కూళ్ల గేట్లను దిగ్బంధించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, అక్టోబర్ 5న లెన్స్ నగరంలో పోలీసుల గ్రెనేడ్ పేలి 15 ఏళ్ల బాలుడి చెయ్యి తెగిపడటం విద్యార్థుల్లో కట్టలు తెంచుకునే ఆగ్రహాన్ని రగిల్చింది. అక్టోబర్ 8న విద్యాశాఖ మంత్రి ఎడ్యువార్డ్ జెఫ్రే 3,000 మంది తాత్కాలిక టీచర్లను నియమిస్తామని ప్రకటించినా విద్యార్థి సంఘాలు ఆ కంటితుడుపు చర్యలను తిరస్కరించాయి.

France in Flames 143-Year-Old Limoges Town Hall Torched Luxury Stores Looted as 8 Lakh Protest

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ధరల మంట.. జతకట్టిన 'ఎల్లో వెస్ట్' ఉద్యమకారులు

విద్యార్థుల పోరాటానికి దేశంలోని ఆర్థిక సంక్షోభం తోడైంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా యూరప్‌లో ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు 2027 బడ్జెట్ ముసాయిదాలో ప్రభుత్వం 54 బిలియన్ యూరోల ఖర్చు తగ్గింపు (పొదుపు చర్యలు) ప్రతిపాదించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. వీరికి 2018లో ఇంధన పన్నులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన ప్రఖ్యాత 'ఎల్లో వెస్ట్' ఉద్యమకారులు, రైతులు జతకట్టారు. శనివారం 'ఎల్లో అండ్ యూత్' పేరుతో వీరంతా ఏకమై రోడ్డెక్కారు. మార్సెయిలో మేయర్ కార్యాలయాన్ని ముట్టడించిన నిరసనకారులు "ఇది విప్లవం.. మేం బాస్టిల్ కోటను స్వాధీనం చేసుకుంటున్నాం" అంటూ 1789 విప్లవ నినాదాలు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

France in Flames 143-Year-Old Limoges Town Hall Torched Luxury Stores Looted as 8 Lakh Protest

చరిత్రను బూడిద చేసిన విధ్వంసం.. లిమోజెస్ టౌన్ హాల్ విషాదం

శనివారం నాటి అల్లర్లలో అత్యంత విషాదకర ఘట్టం లిమోజెస్ నగరంలోని 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్ దగ్ధం కావడం. పింగాణీ పరిశ్రమకు పెట్టింది పేరైన లిమోజెస్‌లో వర్సైల్స్ ప్యాలెస్ ఆర్కిటెక్ట్ చార్లెస్-ఆల్ఫ్రెడ్ లెక్లెర్క్ డిజైన్‌తో 1883 లో నియో-రెనెసాన్స్ శైలిలో ఈ భవనాన్ని నిర్మించారు. 141 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్ కలిగిన ఈ అద్భుత కట్టడం రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరలేదు. 1940లో నాజీ జర్మనీ దాడుల వేళ బెల్జియం ప్రభుత్వం ఇక్కడి నుంచే తాత్కాలిక పాలన సాగించింది. 1975లో చారిత్రక చిహ్నంగా గుర్తింపు పొందిన ఈ భవనం.. ముసుగు దుండగుల దాడిలో కాలి బూడిదైంది. మరోవైపు లియోన్‌లో చారిత్రక టూరిజం కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు, మంటలు ఆర్పకుండా ఫైర్ సిబ్బందిని అడ్డుకున్నారు. తమ సిబ్బందిని ఆందోళనకారులు 'పంచింగ్ బ్యాగుల్లా' వాడుకుంటున్నారని, రాళ్ల దాడులతో ఉచ్చులోకి లాగుతున్నారని ఫ్రాన్స్ పోలీస్ యూనియన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

2027 ఎన్నికల రాజకీయం.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు

మరో ఆరు నెలల్లో (2027 ఏప్రిల్‌లో) ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పదవీకాలం ముగుస్తుండటంతో, ఆయన వారసత్వం కోసం పోటీ పడుతున్న మితవాద నేత మెరైన్ లీ పెన్, వామపక్ష నేత జీన్-లూక్ మెలాంచోన్ ఈ అల్లర్లను రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. వామపక్షాలే అల్లర్లను రెచ్చగొడుతున్నాయని ప్రధాని లెకోర్ను, లీ పెన్ ఆరోపిస్తుండగా.. పోలీసుల అణచివేతపై మెలాంచోన్ మండిపడుతున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఫ్రాన్స్ చాలా అందమైన ప్రదేశం.. విప్లవాలకు పెట్టింది పేరు. పదండి ఫ్రాన్స్ వెళ్లి ఆ విప్లవంలో చేరుదాం" అంటూ ఎద్దేవా చేశారు. పాశ్చాత్య లిబరల్స్ తెచ్చిన అనాలోచిత వలస విధానాలే ఫ్రాన్స్‌లో చారిత్రక కట్టడాలు తగలబడే దుస్థితికి కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించారు.

Advertisement
Advertisement