త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు

Bathukamma | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి 2 వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

S

International | Published On Oct 19, 2026, 7.21 pm IST

Bathukamma | లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు
Advertisement

2 వేల‌కు పైగా హాజరైన ప్రవాస కుటుంబ సభ్యులు
ప్రత్యేక అతిథిగా ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం

Bathukamma | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి 2 వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రూత్ క్యాడ్బ‌రీ, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌన్స్‌లో మేయ‌ర్ రణ్జిత్ గిల్, హౌన్స్‌లో కౌన్సిల్ నేత శాంతను రాజావత్, ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవల‌ప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.

గ‌తంలో కేసీఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే, అదే స్ఫూర్తితో కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ, దసరా" గా జరుపుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నేడు ఈ వేడుకలకు టాక్ సంస్థ కార్యకర్తగా, మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాల‌నే సంకల్పంతో పాల్గొనడం జరిగిందని, ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ గడ్డపై ఎత్తిన జెండాను దించకుండా అది రాజకీయ వేదికలైన సామాజిక సంస్థలకు సంబంధించిన వేదికలైన ప్రపంచానికే స్ఫూర్తిగా, ఆదర్శంగా టాక్ కార్యవర్గం నిలిచిందని వారందరిని ప్రత్యేకంగా అభినందించారు. హాజరై విజయవంతం చేసిన అతిథులకు, ప్రవాస బిడ్డలకు, సహకరించిన‌ ప్రతీ ఒక్కరికి అనిల్ కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస స‌మాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున రెడ్డి తెలిపారు. మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు తెలిపారు.

టాక్ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌ప‌ర్సన్ గణేష్ కుప్పలా మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం) ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు ధ‌రిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రసంశించారు.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు.

టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, కాబట్టి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్వైజ‌రీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, రాకేష్ పటేల్ మాట్లాడుతూ టాక్ సంస్థ ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని తెలిపారు. బతుకమ్మ బహుమతులను, ఇతర బహుమతులను స్పాన్సర్ చేసిన నాగరాజు తౌటంని టాక్ సంస్థ ప్రత్యేకంగా సన్మానించి గౌరవించారు. టాక్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, సత్యపాల్ రెడ్డి పింగళి మాట్లాడుతూ... గతంలో ఎన్నో సందర్భాల్లో నాగరాజు టాక్ సంస్థకు వివిధ‌ సహాయ సహకారాలు అందించారని, అలాగే ఎల్లపుడూ దాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసి వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ కార్యదర్శులు రవి రేతినేని, హరి గౌడ్, రవి పులుసు మాట్లాడుతూ.. మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన స్పాన్సర్ సంస్థలకు, స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఒక పక్క వ్యక్తిగతంగా రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాధ్య‌త గల తెలంగాణ‌ బిడ్డలుగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఉత్తమ బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతి, బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, టాక్ ప్రధాన కార్యదర్శులు సుప్రజ పులుసు, సత్యపాల్, శ్రీకాంత్ జెల్ల, టాక్ కన్వీనర్ అశోక్ దూసరి, అడ్వైజ‌రీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ముఖ్య సభ్యులు మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల, పవిత్ర కంది, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, సత్యమూర్తి చిలుమల, వెంకట్ రెడ్డి దొంతుల, సత్యం కంది, రవి రేటినేని, రవి ప్రదీప్, హరి గౌడ్ నవాబ్‌పేట్, క్రాంతి రేటినేని, జాహ్నవి, శశి, తేజ, నిఖిల్, నాగరాజు, ప్రవీణ్ వీర, యువజన విభాగం నాయకులు తరుణ్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement