Tiger Shroff | గన్ జామ్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డ నటుడు.. టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక విషయాలు..
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుండగులు కాల్పులు జరిపిన సమయంలో టైగర్ వెంటనే సీట్లో కిందకు వంగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా ముంబయి పోలీసులు భావిస్తున్నారు. జుహూలోని పుష్ప నర్సీ పార్క్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు దుండగులు ఆయన బీఎండబ్ల్యూ కారుపై కాల్పులు జరిపారు.
Entertainment | Published On Oct 20, 2026, 11.30 am IST
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుండగులు కాల్పులు జరిపిన సమయంలో టైగర్ వెంటనే సీట్లో కిందకు వంగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా ముంబయి పోలీసులు భావిస్తున్నారు. జుహూలోని పుష్ప నర్సీ పార్క్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు దుండగులు ఆయన బీఎండబ్ల్యూ కారుపై కాల్పులు జరిపారు.
గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. రేహాన్ అనే నిందితుడు టైగర్ కూర్చున్న సీటు పక్కనే కారు డోర్‌పై తొలుత కాల్పు జరిపాడు. మరోసారి కాల్చేందుకు ప్రయత్నించగా అతడి తుపాకీ జామ్ అయింది. మరో నిందితుడు ఫూల్ సింగ్ కారు ముందు నిలబడి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఓ బుల్లెట్ కారు విండ్‌షీల్డ్‌ను ఛేదించి వెనుక సీటులోకి దూసుకెళ్లింది. దీంతో అద్దం ధ్వంసమైంది. టైగర్ వెంటనే కిందకు వంగిపోవడంతో బుల్లెట్లు నేరుగా తగలకుండా తప్పించుకున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. కాల్పుల ఘటనలో టైగర్‌కు పగిలిన అద్దం ముక్కలతో స్వల్ప గాయాలయ్యాయి. ఆయన డ్రైవర్ ఫిర్దౌస్ ఇబ్రహీం బలోచ్, సమీపంలో ఉన్న ఉమేశ్ చౌహాన్ కూడా గాయపడ్డారు. ఘటనా స్థలంలో 10 బుల్లెట్ ముక్కలను ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఎన్ని కారు ఢీకొని ముక్కలయ్యాయి? ఎన్ని బుల్లెట్లు పేలాయి? అన్నది తేలాల్సి ఉంది. ఒక బుల్లెట్ ఇప్పటికీ కారు లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్, పాదచారికి తగిలిన గాయాలకు బుల్లెట్లా.. వాటి శకలాలే కారణమన్నది బాలిస్టిక్ నివేదికతో స్పష్టం కానుంది.
పక్కాగా ప్లాన్ చేసి..
ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు షూటర్లతో పాటు, దాడి అనంతరం పారిపోయేందుకు ఓ వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఫూల్ సింగ్ నరేశ్ (18), రేహాన్ అన్సారీ (18), హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ మహతో (20)లను రాజస్థాన్‌లోని కోటాలో అరెస్ట్ చేశారు. నిందితులకు ఆయుధాలు ఎవరు సమకూర్చారు? దాడి వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పుల అనంతరం నిందితులు పోలీసులకు చిక్కకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తూ ప్రాంతాలు మారారు. అయితే, బోరివలి రైల్వే స్టేషన్ సమీపంలో సూరత్‌కు వెళ్లేందుకు యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ ఆలస్యమవడంతో డ్రైవర్‌కు ఫోన్ చేసి తాము ఉన్న ప్రాంతాన్ని తెలిపారు. ఆ ఒక్క ఫోన్‌కాల్ ఆధారంగా పోలీసులు డ్రైవర్‌ను గుర్తించి సంప్రదించారు. అప్పటికే నిందితులను సూరత్‌లో దింపినట్లు డ్రైవర్ చెప్పాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ముగ్గురూ బస్‌స్టాండ్ సమీపంలో కనిపించారు. అనంతరం రైలు ఎక్కి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారు ప్రయాణిస్తున్న కోచ్‌ను నిర్ధారించారు. వెంటనే కోటా పోలీసులకు సమాచారం అందించారు.
కోటా రైల్వే స్టేషన్‌లో అరెస్ట్
ముంబయి క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజ్ రోషన్ నుంచి సమాచారం అందుకున్న కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వే స్టేషన్ లోపల, బయట, ప్లాట్‌ఫామ్‌లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో 20 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. రైలులో తనిఖీలు నిర్వహించి జనరల్ కోచ్‌లో ఉన్న నిందితులను గుర్తించి చుట్టుముట్టారు. దీంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండా అరెస్ట్ చేశారు. టైగర్ ష్రాఫ్‌పై దాడికి వారం ముందే నిందితులు అదే ప్రాంతంలో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా రికార్డుల ద్వారా వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 11న కూడా వారు అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. ఆ రోజు టైగర్ ఫుట్‌బాల్ ఆడేందుకు రాకపోవడంతో వెనుదిరిగి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గతంలోనూ దాడి యత్నాలు జరిగాయా? నిందితుల వెనుక ఉన్నవారెవరు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Deepti Jeewanji | దీప్తి జీవాంజి పసిడి మెరుపులు..! పారా ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన తెలంగాణ బిడ్డ
అక్టోబర్ 20, 2026

Sai Pallavi | బాలీవుడ్ సినిమా అనగానే భయపడ్డా – రామాయణపై సాయిపల్లవి కామెంట్స్
అక్టోబర్ 20, 2026

Mohan Bhagwat | విభజనతో బలహీనపడ్డం.. ఐక్యతే మన బలం : మోహన్ భగవత్
అక్టోబర్ 20, 2026
తాజావార్తలు
- ●Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
- ●UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..
- ●India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!
- ●JD Vance H1B Visa Remarks | నా అత్తమామలు సౌత్ ఇండియన్సే, వారిని ప్రేమిస్తాను కానీ..!
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు తగ్గిన బంగారం ధర.. కారణం ఇదేనా..?

Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్

UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన

Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!



