త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jailer 2 Review | జైల‌ర్ 2 రివ్యూ – ర‌జ‌నీకాంత్ హీరోయిజం, ఎలివేష‌న్లు ఓకే కానీ … కానీ క‌థ ఏది?

యంగ్ డైరెక్ట‌ర్ల‌లో ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ను బాగా వాడుకున్న డైరెక్ట‌ర్ల‌లో నెల్స‌న్ ఒక‌రు. హీరోయిన్ల‌తో రొమాంటిక్ స్టెప్పులు, డైలాగ్స్...రొడ్డ‌కొట్టుడు ఫైట్స్ లేకుండా ర‌జ‌నీకాంత్‌ను ఆయ‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లోనే చూపిస్తూ మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌చ్చ‌ని జైల‌ర్ తో నిరూపించాడు. జైల‌ర్ 2తో ఆ మ్యాజిక్‌ను కొన‌సాగించారు.

N

Entertainment | Published On Oct 15, 2026, 7.05 pm IST

Jailer 2 Review | జైల‌ర్ 2 రివ్యూ – ర‌జ‌నీకాంత్ హీరోయిజం, ఎలివేష‌న్లు ఓకే కానీ … కానీ క‌థ ఏది?
Advertisement

Jailer 2 Review |  ర‌జ‌నీకాంత్ (Rajinikanth)ద‌క్షిణాదిలో తిరుగులేని మాస్ హీరోగా కొన‌సాగుతోన్నారు. త‌న డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్, సిగ‌రెట్ వెలిగించే తీరు..ఎలివేష‌న్లు, హీరోయిజాన్ని పండించ‌డం... మిగిలిన హీరోల‌తో పోలిస్తే భిన్నంగా...స్టైలిష్‌గా ఉంటాయి. ఈ ట్రేడ్ మార్క్ సీన్లుతోనే ఆడిన సినిమాలు ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో చాలానే ఉన్నాయి.
బాల‌చంద‌ర్‌, కేఎస్ ర‌వికుమార్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు ర‌జ‌నీకాంత్‌కు ఓ మాస్ ఇమేజ్‌ను సెట్ చేశారు. ఆ ఇమేజ్‌ను స్క్రీన్‌పై చూపించ‌డంలో యంగ్ డైరెక్ట‌ర్లు మాత్రం త‌డ‌బ‌డిపోతున్నారు. పైగా వ‌య‌సు కూడా ప్ర‌ధాన అడ్డంకిగా మారిపోయింది.

జైల‌ర్‌తో దారి...

75 ఏళ్ల వ‌య‌సులో కుర్ర హీరోల్లా ల‌వ్ సాంగ్స్‌, రొమాంటిక్ డైలాగ్స్ చెబితే ఆడియెన్స్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ హ‌ద్దుల విష‌యంలోనే ద‌ర్శ‌కులు త‌డ‌బ‌డిపోతున్నారు. వారంద‌రికి జైల‌ర్ తో ఓ దారి చూపించాడు డైరెక్ట‌ర్ నెల్స‌న్‌.

ర‌జ‌నీకాంత్ రిస్కీ ఫైట్స్ చేయ‌న‌వ‌స‌రం లేదు. హీరోయిన్‌తో స్టెప్పులు వేయాల్సిన ప‌నిలేదు. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లోనే ప‌వ‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై చూపిస్తూ ఓ మ్యాజిక్ చేశారు. అదే ఆడియెన్స్‌కు న‌చ్చింది. జైల‌ర్ మూవీ ఆరు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.
ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి కొన‌సాగింపుగా జైల‌ర్ 2 వ‌చ్చింది. పార్ట్ వ‌న్‌లోని క‌థ‌, పాత్ర‌ల‌ను కొన‌సాగిస్తూ ద‌ర్శ‌కుడు ఈ సీక్వెల్‌ను రూపొందించారు.

ముత్తు వేల్ పోరాటం...

విగ్ర‌హాల అక్ర‌మంగా త‌ర‌లించే వ‌ర్మ ముఠాను నాశ‌నం చేస్తాడు జైల‌ర్ ముత్తువేల్ పాండియ‌న్ (ర‌జ‌నీకాంత్‌). ఈ ముఠాతో సంబంధం ఉన్న కొడుకును చంపేస్తాడు. కొడుకు జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఊరు విడిచి మ‌రోచోట అజ్ఞాత జీవితం గ‌డుపుతుంటాడు. ఓ సూప‌ర్‌మార్కెట్‌లో ప‌నిచేస్తూ భార్య‌, కోడ‌లు, మ‌న‌వ‌డితో సంతోషంగా బ‌తుకుతుంటాడు. వ‌ర్మ స్నేహితుడు దిలీప్‌(సూర‌జ్ వెంజ‌ర‌మూడు)...ముత్తు కోసం వెతుకుతుంటాడు. జైల‌ర్ ఆచూకీ క‌నిపెట్టి అత‌డిని చంపాల‌ని చూస్తుంటాడు.
వ‌ర్మ గ్యాంగ్‌కు సంబంధించిన మూడు ట్ర‌క్కుల విగ్ర‌హాలు త‌న ద‌గ్గ‌ర ఉండ‌టంతో వాటి కోసం ఎప్ప‌టికైనా అత‌డి మ‌నుషులు త‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తార‌ని జైల‌ర్ ముందే క‌నిపెడ‌తాడు. వారు త‌న కుటుంబంపై ఎటాక్ చేసే లోపే తానే గ్యాంగ్ మొత్తాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని ఫిక్స‌వుతాడు. మూర్తి, విమ‌ల్‌ల‌ను అడ్డుపెట్టుకొని దిలీప్‌కు చెక్‌పెడ‌తాడు.

దిలీప్ ద్వారా ఈ గ్యాంగ్ వెనుక‌ భోది క‌ల్ప‌క్ (ఎస్‌జే సూర్య‌), కాంత (విద్యా బాల‌న్‌)ఉన్నార‌ని తెలుసుకుంటాడు. జైల‌ర్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలియ‌ని బోధి, కాంత అత‌డికి ఈజీగా దెబ్బ‌కొట్ట‌చ్చ‌ని అనుకుంటారు. వారికి జైల‌ర్ ఎలాంటి షాకిచ్చాడు? వారు వేసిన ఎత్తుల‌ను ఏ విధంగా తిప్పికొట్టాడు? కొడుకు చావుకు వెన‌కున్న నిజాన్ని బ‌య‌ట‌పెట్టి కుటుంబ‌స‌భ్యుల నుంచి జైల‌ర్‌ను బోధి ఎలా దూరం చేశాడు? త‌న స్నేహితులు న‌ర‌సింహ‌(శివ‌రాజ్ కుమార్‌), మాథ్యూ (మోహ‌న్‌లాల్‌) రోడీ (హృతిక్ రోష‌న్‌) సాయంతో క‌ల్ప‌క్ ఫ్యామిలీని జైల‌ర్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

విల‌న్లు కొత్త‌వాళ్లు...

జైల‌ర్ క‌థ కొత్త‌దేమీ కాదు. హీరోకు బ‌ల‌హీన‌తే కుటుంబం. త‌న వారిని కాపాడుకోవ‌డం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు. ఎంత దూర‌మైన వెళ‌తాడ‌ని ఫ‌స్ట్ పార్ట్‌లోనే డైరెక్ట‌ర్ చూపించారు. అదే ఎమోష‌న్‌, అవే పాత్ర‌లు సీక్వెల్‌లో క‌నిపిస్తాయి. విల‌న్లు మాత్ర‌మే కొత్త‌వాళ్లు. వారి బారి నుంచి త‌న కుటుంబాన్ని జైల‌ర్ ఎలా ర‌క్షించుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

ఈ సింపుల్ పాయింట్‌కు ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌తో పాటు గెస్ట్ పాత్ర‌ల‌ను వాడుకుంటూ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. నెల్స‌న్ సినిమాల్లో కామెడీ కోసం స‌ఫ‌రేట్ ట్రాక్‌లు క‌నిపించ‌వు. క‌థ‌లో నుంచే అంత‌ర్భాగంగా ఫ‌న్ జ‌న‌రేల్ అయ్యేలా స్క్రీన్‌ప్లే ను రాసుకుంటాడు. జైల‌ర్ 2లో ఆ ఫార్ములాను వాడేశారు.

ఫ‌స్ట్ హాఫ్ ఫ‌న్‌...

మూర్తి అనే పాత్ర‌ను వాడుకుంటూ దిలీప్ గ్యాంగ్‌ను జైల‌ర్ బ‌క‌రా చేసే సీన్లు న‌వ్విస్తాయి. ముత్తు గురించి తెలిసిన నిజాలు చెప్ప‌లేక యోగిబాబు ప‌డే ఇబ్బందుల‌తో ఫ‌స్ట్ హాఫ్ మొత్తం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ర‌జ‌నీ ఎలివేష‌న్ల‌తో బ్యాలెన్స్ చేశారు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్ డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసుకున్నారు.
కీల‌క‌మైన సెకండాఫ్ ఈ సినిమాకు మైన‌స్ అయ్యింది. మ‌ళ్లీ కొత్త ప్ర‌పంచం, కొత్త విల‌న్ల‌తో సినిమా ఫ్రెష్‌గా స్టార్ట‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

సెకండాఫ్ మైన‌స్‌...

విద్యా బాల‌న్‌, ఎస్ జే సూర్య చాలా స్టైలిష్‌గా క‌నిపించారు. ప‌వ‌ర్‌ఫుల్ అన్న‌ట్లుగా ప‌రిచయం చేశారు. కానీ జైల‌ర్‌ను దెబ్బ‌తీయ‌డానికి వారు వేసే ఎత్తులు మాత్రం పాత‌కాలం నాటివి. ఈ సీన్ల‌ను డిఫ‌రెంట్‌గా రాసుకుంటే జైల‌ర్ 2 మ‌రో లెవెల్‌లో ఉండేది. కొడుకు చావును బ‌య‌ట‌పెట్టి ఎమోష‌న‌ల్‌గా బ్లాక్‌మెయిల్ చేసే స‌న్నివేశం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది.
జైల‌ర్ 2లో చాలా మంది స్టార్స్ గెస్ట్‌లుగా క‌నిపిస్తారు. కానీ వారిని వాడుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ అయ్యాడు. హృతిక్ రోష‌న్ (Hrithik Roshan) ఎంట్రీ అదిరిపోతుంది. ఫైట్ సీక్వెన్స్‌లో అంతే స్టైల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయారు, శివ‌రాజ్‌కుమార్ , మోహ‌న్‌లాల్ పాత్ర‌లు క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుగా అనిపిస్తాయి. విజ‌య్ సేతుప‌తి కేవ‌లం ఒకే డైలాగ్‌కు ప‌రిమిత‌మ‌య్యాడు. జాకీ ష్రాఫ్ క‌నీసం డైలాగ్ కూడా లేదు.

ర‌జ‌నీకాంత్ వ‌న్ మెన్ షోగా ఈ సినిమా సాగుతుంది. 75 ఏళ్ల వ‌య‌సులోనూ చాలా ఎన‌ర్జిటిక్‌గా స్క్రీన్‌పై క‌నిపించారు. ర‌మ్య‌కృష్ణ‌, మిర్నామీన‌న్‌తో పాటు చాలా మంది సీనియ‌ర్ యాక్ట‌ర్లు ఉన్నా ఎవ‌రి పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. ర‌జ‌నీకాంత్ ఎలివేష‌న్ సీన్ల‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ బాగుంది. పాట‌లు మాత్రం తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కావు. లిరిక్స్ ఒక్క‌టి కూడా అర్థం కాకుండా రాసేశారు.

ర‌జ‌నీకాంత్ అభిమానిగా సినిమా చూస్తే జైల‌ర్ 2 బాగా న‌చ్చుతుంది. క‌థ, క‌థ‌నాల‌పై ఫోక‌స్ పెడితే మాత్రం డిస‌పాయింట్ చేస్తుంది.

 

Advertisement
Advertisement