త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oh Sukumari Review | ఓ సుకుమారి రివ్యూ – హీరోయిన్‌ను ముట్టుకుంటే క‌రెంట్ షాక్ – తెలంగాణ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

తెలంగాణ నేప‌థ్యంలో రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఓ సుకుమారి శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తిరువీర్‌, ఐశ్వ‌ర్య రాజేష్ ఈ సినిమాతో హిట్టు కొట్టారా? లేదా? అంటే? దామిని యాద‌గిరి క‌థ‌....

N

Entertainment | Published On Jul 17, 2026, 7.12 pm IST

Oh Sukumari Review |  ఓ సుకుమారి రివ్యూ – హీరోయిన్‌ను ముట్టుకుంటే క‌రెంట్ షాక్ – తెలంగాణ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Oh Sukumari Review |  తీరువీర్‌, ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా న‌టించిన మూవీ ఓ సుకుమారి . తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు భ‌ర‌త్ ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?

దామిని...యాదగిరి కథ...

న‌రాల యాద‌గిరి (తిరువీర్) స‌ర్పంచ్ కావాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఎన్నిక‌ల్లో రూపాయి ఖ‌ర్చు పెట్ట‌కుండా విజ‌యం సాధించాల‌ని చూస్తుంటాడు. యాద‌గిరి బాబాయ్ కొడుకు స‌ప్త‌గిరి (శ్రీనివాస్ గవిరెడ్డి) ప్ర‌త్య‌ర్థి పార్టీలో జాయిన్ అవుతాడు. యాద‌గిరి, స‌ప్త‌గిరిల‌లో ఎవ‌రికి మొద‌ట అబ్బాయి పుడుతే వారికే ఎన‌భై ఎక‌రాల ఆస్తి ద‌క్కేలా వారి తాత వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ప్ర‌కారం ఆస్తి ద‌క్కించుకోవాల‌ని అనుకున్న యాద‌గిరి పెళ్లి చూపుల కోసం చంద్లాపూర్ అనే ఊరికి వెళ‌తాడు. అక్క‌డ దామినిని (ఐశ్వర్య రాజేష్) చూస్తాడు. తొలి చూపుల‌తోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. దామిని చిన్న‌త‌నం నుంచి ఓ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది. ఆమె ఎవ‌రిని ముట్టుకున్నా...ఆమెను ఎవ‌ర‌న్నా ముట్టుకున్నా వారికి క‌రెంట్ షాక్ త‌గులుతుంది. దాంతో దామిని పేరు చెబితేనే ఊరివాళ్లంతా వ‌ణికిపోతుంటారు. ఆమె పీడ‌ను ఎలాగైనా వ‌దిలించుకోవాల‌ని దామిని స‌మ‌స్య‌ను దాచిపెట్టి యాద‌గిరితో పెళ్లి జ‌రిపిస్తారు. శోభ‌నం రోజే దామిని స‌మ‌స్య గురించి యాద‌గిరి తెలుస్తుంది. అయినా ఇంట్లో వాళ్ల ద‌గ్గ‌ర దాచిపెట్టి భార్య‌తో ప్రేమ‌గా ఉంటాడు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుడి ప‌న్నాగాల వ‌ల్ల దామిని క‌రెంట్ షాక్ స‌మ‌స్య గురించి యాద‌గిరి కుటుంబ‌స‌భ్యుల‌కు తెలుస్తుంది. దాంతో దామిని ఇంట్లో నుంచి వెళ్ల‌గొడ‌తాడు యాద‌గిరి. భార్య గొప్ప‌త‌నాన్ని యాద‌గిరి ఎలా తెలుసుకున్నాడు? దామిని గ‌తం ఏమిటి? దామిని వ‌ల్ల యాద‌గిరి కుటుంబంతో పాటు చంద్లాపూర్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మంచి జ‌రిగింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

కాన్సెప్ట్ కొత్త‌గా ఉంటే స‌రిపోదు...

సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాలంటే పాయింట్‌ కొత్త‌గా ఉంటే స‌రిపోదు. ఆ క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించే విధానంలో అదే ఫ్రెష్‌నెస్ క‌నిపించాలి. ఆ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ రిలేట్ అయ్యేలా ఎమోష‌న్స్ పండాలి. అవ‌న్నీ స‌రిగ్గా లేక‌పోతే సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా ఓ సుకుమారి నిలుస్తుంది.

ముట్టుకుంటేనే హీరోయిన్‌కు క‌రెంట్ షాక్ కొట్ట‌డం అనే ఐడియా బాగుంది. ఈ క‌థ‌కు స‌రిపోయే హీరోహీరోయిన్లు, యాక్ట‌ర్లు దొరికారు. కానీ ద‌ర్శ‌కుడి క్రియేటివిటీనే క‌రెంట్ షాక్ అనే అంశం ద‌గ్గ‌రే ఆగిపోయింది. సినిమా తీయ‌డంలో రొటీన్‌గా అడుగులు వేశారు. అన‌వ‌స‌ర‌పు కామెడీ సీన్లు, అర్థం లేని ఫ్యామిలీ ఎమోష‌న్లు, లాజిక్‌లెస్  సన్నివేశాలతో ఆడియెన్స్‌ స‌హ‌నానికి ఓ సుకుమారి ప‌రీక్ష‌లా మారిపోయింది.

అతి కామెడీ...

హీరోయిన్ స‌మ‌స్య గురించి చెప్పే సీన్ల‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత హీరో ఎంట్రీ...అత‌డి కుటుంబంలో గొడ‌వ‌లు, తాత వీలునామా అంటూ ఆరంభంలో వ‌చ్చే స‌న్నివేశాలు టైమ్‌పాస్ చేస్తాయి. అందులో కామెడీ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు. నిజాన్ని దాచిపెట్టి హీరోహీరోయిన్ల పెళ్లి చేయ‌డానికి ఝాన్సీ అండ్ టీమ్ చేసి హంగామా ఓ స్టేజ్ త‌ర్వాత అతిగా అనిపిస్తుంది.

తెలంగాణ నేప‌థ్యం...

హీరోయిన్ స‌మ‌స్య గురించి హీరోకు తెలిసే ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పోనీ అక్క‌డి నుంచైనా ద‌ర్శ‌కుడు స‌రైన ట్రాక్‌లో పడ్డాడా అంటే అదీ లేదు.   హీరోయిన్ మంచిత‌నాన్ని చూపించ‌డానికి ఓ భారీ మాస్ ఫైట్ పెట్టాడు. అది క‌థ‌కు అంతగా అత‌క‌లేదు. ఫ్యామిలీ ఎమోష‌న‌న్ సీన్లు తెర‌పై క‌నిపిస్తున్నా వాటితో క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.
క్లైమాక్స్‌లో హీరోయిన్ స‌మ‌స్య సాల్వ్ అయ్యే సీన్ లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. హీరో చెప్పే ఒక్క డైలాగ్‌తో అత‌డి కోసం హీరోయిన్ ప‌రుగులు తీయ‌డం, స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని సంబ‌ర‌ప‌డిపోవ‌డం ఫ‌న్నీగా అనిపిస్తుంది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. తెలంగాణ యాస‌లో చెప్పిన డైలాగ్స్‌, లోకేష‌న్లు బాగున్నాయి. ప్ర‌దీప్ మంచిరాజు పాట‌ల‌న్నీ విన‌సొంపుగా ఉన్నాయి.

కామెడీ టైమింగ్‌...

దామిని, యాద‌గిరి పాత్ర‌ల‌కు ఐశ్వ‌ర్య రాజేష్‌, తీరువీర్ ప్రాణం పోశారు. నిజంగానే తెలంగాణ అమ్మాయి, అబ్బాయిలా క‌నిపించారు. టిఫిక‌ల్ కామెడీ టైమింగ్‌తో తిరువీర్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ఐశ్వ‌ర్య రాజేష్ న‌ట‌న బాగుంది. మై విలేష్ షో ఫేమ్ అంజిమామ కొన్ని సీన్ల‌లో న‌వ్వించాడు. బ‌ల‌గం ముర‌ళీధ‌ర్ గౌడ్‌, ఝాన్సీ లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ల టాలెంట్‌ను ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఓకే. చిన్న సినిమానే అయినా క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేదు.

ఓ సుకుమారి వెరైటీ పాయింట్‌తో వ‌చ్చిన ఔట్‌డేటెడ్ కామెడీ మూవీ. స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతూ ఆడియెన్స్‌కు షాకిస్తుంది.

Advertisement
Advertisement