e-Pindaan | ఆన్‌లైన్‌లోనే పితృకార్యాలు.. కాశీలో ఈ-తర్పణ్..!
e-Pindaan | ఒకప్పుడు పితృకార్యాలంటే పుణ్యక్షేత్రానికి వెళ్లాలి.. అక్కడి పురోహితుడిని సంప్రదించాలి.. నిర్ణయించిన విధంగా పిండ ప్రదానం, తర్పణం చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పితృపక్షం సందర్భంగా సంప్రదాయ ఆచారాలకు సాంకేతికత తోడైంది. కాశీలో గంగాతీరాన పురోహితుడు కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తుడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ముందు కూర్చుని తర్పణం చేస్తున్నాడు.
Devotional | Published On Sep 26, 2026, 3.55 pm IST
- వీడియో కాల్‌లో పితృదేవతలకు తర్పణం
- ఎన్‌ఆర్‌ఐల కోసం ఈ-పిండ ప్రదాన సేవలు
- రూ.5,100 నుంచి రూ.51 వేల వరకు ప్యాకేజీ
- అమెరికా, జపాన్, యూరప్, ఆస్ట్రేలియా నుంచి భారీగా బుకింగ్స్
e-Pindaan | ఒకప్పుడు పితృకార్యాలంటే పుణ్యక్షేత్రానికి వెళ్లాలి.. అక్కడి పురోహితుడిని సంప్రదించాలి.. నిర్ణయించిన విధంగా పిండ ప్రదానం, తర్పణం చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పితృపక్షం సందర్భంగా సంప్రదాయ ఆచారాలకు సాంకేతికత తోడైంది. కాశీలో గంగాతీరాన పురోహితుడు కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తుడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ముందు కూర్చుని తర్పణం చేస్తున్నాడు. కుశ గడ్డి, నువ్వులు, గంగాజలం సిద్ధం చేసుకుని వీడియో కాల్ ద్వారా పితృదేవతలను స్మరించుకుంటున్నాడు. విదేశాల్లో నివసించే ఎన్‌ఆర్‌ఐలకు ఇది మరింత సౌకర్యంగా మారింది. సమయాభావం, వీసా సమస్యలు, ప్రయాణానికి అవకాశం లేకపోవడం వంటి కారణాలతో భారత్‌కు రాలేని వారు ఇప్పుడు తమ ఇళ్ల నుంచే పితృకార్యాల్లో పాల్గొంటున్నారు. కాశీ, గయ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో పురోహితులు నిర్వహించే తర్పణం, పిండ ప్రదానం, త్రిపిండి వంటి కార్యక్రమాలకు ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
రూ.5,100 నుంచి రూ.51 వేల వరకు ప్యాకేజీ..
పితృపక్షం సందర్భంగా కాశీలో ఈ-పిండ ప్రదానానికి పలు రకాల ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. కార్యక్రమం, పూజా విధానం, పురోహితుల సేవలు తదితర అంశాలను బట్టి రూ.5,100 నుంచి రూ.51,000 వరకు ప్యాకేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేరుగా పురోహితులను సంప్రదిస్తుండగా.. మరికొందరు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా సేవలను బుక్ చేసుకుంటున్నారు. అమెరికా, జపాన్, యూరప్, ఆస్ట్రేలియా, సిడ్నీ, స్పెయిన్ తదితర దేశాల్లో ఉంటున్న పలువురు ఇప్పటికే కాశీలోని పురోహితులను సంప్రదించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పితృపక్షంలో తమ పూర్వీకులను స్మరించుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ స్వయంగా కాశీకి రాలేని వారికి ఆన్‌లైన్ సేవలు ఒక ప్రత్యామ్నాయంగా మారాయి. పితృకార్యాల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు యాప్‌లు, సోషల్ మీడియా వేదికగా సేవలను అందిస్తున్నాయి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం వినియోగదారులను ఫోన్‌లో సంప్రదించి వారికి అందుబాటులో ఉన్న వివిధ ప్యాకేజీలను వివరిస్తున్నారు. పిండ ప్రదానం, తర్పణం, త్రిపిండి తదితర కార్యక్రమాలను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. గురుగ్రామ్, నోయిడా, బెంగళూరు, హర్యానా తదితర ప్రాంతాలకు చెందిన కొన్ని సంస్థలు ఈ సేవలను నిర్వహిస్తున్నాయి. త్రిపిండి తర్పణానికి సంబంధించి వేల రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
100కుపైగా బుకింగ్స్.. 20 శాతం ఎన్‌ఆర్‌ఐలే
గురుగ్రామ్‌కు చెందిన ఓ యాప్ సేల్స్ హెడ్ చేతన్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఆన్‌లైన్ త్రిపిండి శ్రాద్ధ పూజ కోసం 100కు పైగాబుకింగ్స్ వచ్చినట్లు చెప్పారు. వీటిలో దాదాపు 20 శాతం ఎన్‌ఆర్‌ఐలవేనని తెలిపారు. పితృదేవతల ఆత్మశాంతి కోసం గయ, కాశీ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో వేర్వేరు తేదీల్లో త్రిపిండి, తర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుకింగ్ చేసుకున్న భక్తులకు నిర్ణయించిన తేదీన గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ చేస్తారు. పురోహితులు పూజా విధానాన్ని వివరిస్తూ సంకల్పం చేయిస్తారు. భక్తులు తమ ఇళ్ల నుంచే కార్యక్రమంలో పాల్గొంటారు.
గంగాతీరంలో పూజ.. విదేశాల్లో భక్తుడు
ఈ-తర్పణంలో ప్రధానంగా సంప్రదాయ పద్ధతులను పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశీలో ఉన్న పురోహితులు గంగాతీరంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మరోవైపు వీడియో కాల్‌లో ఉన్న భక్తుడికి అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. కుశ గడ్డి, నువ్వులు, గంగాజలం తదితరాలను సిద్ధం చేసుకున్న భక్తులు పురోహితుల సూచనల మేరకు తర్పణం చేస్తున్నారు. మంత్రోచ్ఛారణ, సంకల్పం తదితర కార్యక్రమాలను వీడియో కాల్ ద్వారా అనుసరిస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా పుణ్యక్షేత్రానికి వెళ్లలేని వారికి కూడా పితృకార్యాల్లో పాల్గొనే అవకాశం ఏర్పడుతోంది. పితృకార్యాల కోసం ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుంటున్న వారిలో ఎన్‌ఆర్‌ఐలతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్‌లైన్ త్రిపిండి తర్పణం కోసం సంప్రదిస్తున్న వారిలో సుమారు 20 శాతం విదేశీయులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. పితృకార్యాలపై ఆసక్తి ఉన్న వారు వివిధ దేశాల నుంచి ఆన్‌లైన్ ద్వారా సంప్రదించి సేవలను బుక్ చేసుకుంటున్నారు.
ఏమీ చేయకపోవడం కంటే స్మరించుకోవడమే మేలు
సాంకేతికత ద్వారా పితృకార్యాలు నిర్వహించడంపై కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామనారాయణ ద్వివేది స్పందించారు. పురాతన కాలంలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేవని.. కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నాయని పేర్కొన్నారు. ‘పవిత్రమైన మనసుతో, పూర్తి శ్రద్ధతో, సంకల్పంతో పితృదేవతలకు తర్పణం నిర్వహిస్తే.. ప్రత్యక్షంగా హాజరై కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో లభించే ఫలితమే లభిస్తుంది. పితృదేవతలను ఏదో ఒక విధంగా స్మరించుకోవడం.. ఏమీ చేయకుండా ఉండటంకంటే మంచిది’ అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి సంప్రదాయ పితృకార్యాలకు సాంకేతికత జత కావడంతో ‘ఈ-తర్పణం’ కొత్త రూపంలో ముందుకొస్తోంది. కాశీ గంగాతీరం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల వరకు వీడియో కాల్ ద్వారా అనుసంధానం చేస్తూ.. పితృపక్షంలో పూర్వీకులను స్మరించుకునే కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
శనివారంతో మొదలైన పితృపక్షాలు..
మహాలయ పితృపక్షాలు శనివారం నుంచి మొదలయ్యాయి. భాద్రపద పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి శ్రాద్ధంతో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 27 ఆదివారం నుంచి కృష్ణపక్షంలోని ప్రతిపద తిథితో ప్రధాన పితృపక్ష శ్రాద్ధాలు ప్రారంభమవుతాయి. వరుసగా 16 రోజులపాటు పితృదేవతలను స్మరిస్తూ తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 10, శనివారం సర్వపితృ అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. ఈ రోజున ఏ తిథి తెలియని పితృదేవతలతో పాటు ఇతర పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?
- ●DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్
- ●Vaddiraju Ravichandra | నిరంకుశ విధానాలను ఎండగట్టిన ధీర వనిత.. ఐలమ్మ
- ●EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్రభావం.. లాభమా, నష్టమా..?
- ●Keerthy Suresh | ఇద్దరు మగాళ్లు ప్రేమలో పడితే - తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ వివాదాస్పద సినిమా
- ●INDIA | సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ

UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?

DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్

Vaddiraju Ravichandra | నిరంకుశ విధానాలను ఎండగట్టిన ధీర వనిత.. ఐలమ్మ

EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్రభావం.. లాభమా, నష్టమా..?






