త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs AUSW | టెస్టు మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మి.. మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్ ఆసీస్ కైవ‌సం..

INDW Vs AUSW | ఆస్ట్రేలియాతో పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భార‌త మ‌హిళల‌ జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఆస్ట్రేలియా జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న బ్యాట‌ర్ అలిస్సా హీలీ ఈ మ్యాచ్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా, తోటి ప్లేయ‌ర్లు ఆమెకు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

S

Cricket | Published On Mar 8, 2026, 4.47 pm IST

INDW Vs AUSW | టెస్టు మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మి.. మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్ ఆసీస్ కైవ‌సం..
Advertisement

INDW Vs AUSW | ఆస్ట్రేలియాతో పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భార‌త మ‌హిళల‌ జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఆస్ట్రేలియా జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న బ్యాట‌ర్ అలిస్సా హీలీ ఈ మ్యాచ్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా, తోటి ప్లేయ‌ర్లు ఆమెకు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. ఈ మ్యాచ్‌లో భార‌త్‌పై ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌ను కూడా ఆతిథ్య జ‌ట్టు 12-4 తేడాతో కైవ‌సం చేసుకుంది.

ప్ర‌తీకా రావ‌ల్ తొలి హాఫ్ సెంచ‌రీ..

పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ప్రారంభమైనప్పుడు భారత్ ఇంకా 20 పరుగుల వెనుకబడి ఉంది. అప్పటికి ప్ర‌తీకా రావల్, స్నేహ్ రాణా క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు తొలి సెషన్‌లో ఈ జోడీ మరో 27 పరుగులు జోడించింది. అయితే అనంతరం ఆష్లే గార్డెన‌ర్ బౌలింగ్‌లో స్నేహ్ రాణా వికెట్ కోల్పోయింది. త‌రువాత ప్ర‌తీకా రావల్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసింది. రాణా అవుట్ అయిన తర్వాత కాశ్వీ గౌతమ్ క్రీజ్‌లోకి వచ్చింది. అయితే ఆమె ఒక్క పరుగూ చేయకుండానే అలానా కింగ్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయింది. తరువాత సయాలి స‌త్ఘ‌రే రావల్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగింది. ఆ సమయంలో రావల్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ కింగ్ బౌలింగ్‌లో స‌యాలి కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయింది.

అన‌బెల్ స‌ద‌ర్లాండ్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌..

తర్వాత రావల్ మరోసారి పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఆష్లే గార్డెన‌ర్ బౌలింగ్‌లో అవుట్ అయింది. దీంతో భారత్ మొత్తం 149 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు విజయం కోసం కేవలం 25 పరుగులు మాత్ర‌మే అవ‌సరం అయ్యాయి. ఆ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా తరఫున జార్జియా వోల్, ఫీబీ లిచ్‌ఫీల్డ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ జోడీ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఆస్ట్రేలియా తరఫున రెండో ఇన్నింగ్స్‌లో లూసీ హామిల్టన్ 3 వికెట్లు పడగొట్టగా, అనబెల్ సదర్లాండ్, అలానా కింగ్, ఆష్లే గార్డెన‌ర్ త‌లా 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి శతకం సాధించిన అనబెల్ సదర్లాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఆసీస్ కెప్టెన్‌..

ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తన టెస్ట్ కెరీర్‌ను 11 మ్యాచ్‌లలో 502 పరుగులతో ముగించింది. ఆమె సగటు 29 కాగా అత్యధిక స్కోరు 99 పరుగులు. వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా హీలీ 3వేలకుపైగా పరుగులు సాధించింది. ఆమె 16 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ఈ ఘన విజయంతో ముగిసింది. మ్యాచ్ అనంతరం హీలీ తన సహచర ప్లేయ‌ర్లు, సపోర్ట్ సిబ్బందిని ఆలింగనం చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. ఇక అంత‌కు ముందు జ‌రిగిన టీ20 సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకున్నా, త‌రువాత జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను మాత్రం క్లీన్ స్వీప్‌తో కోల్పోయింది. ఇక ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లోనూ భార‌త్ ఓట‌మి పాలైంది. దీంతో మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్‌లో మొత్తం క‌లిపి భార‌త్‌కు 4 పాయింట్లు రాగా ఆసీస్ 12 పాయింట్లు సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement