త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమ‌తులు.. అమ‌లులోకి వ‌చ్చిన భార‌త్‌-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!

India-New Zealand FTA | భారత్‌–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే భారత వస్తువులన్నింటికీ దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, కార్పెట్లు, సిరామిక్స్‌, ఇంజినీరింగ్‌ వస్తువులు, ఆటో విడిభాగాల రంగాలకు ప్రయోజనం చేకూరనుంది. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం.. భారత్‌ అమల్లోకి తెచ్చిన 17వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే.

P

Business | Published On Oct 20, 2026, 12.00 pm IST

India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమ‌తులు.. అమ‌లులోకి వ‌చ్చిన భార‌త్‌-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!
Advertisement

India-New Zealand FTA | భారత్‌–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే భారత వస్తువులన్నింటికీ దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, కార్పెట్లు, సిరామిక్స్‌, ఇంజినీరింగ్‌ వస్తువులు, ఆటో విడిభాగాల రంగాలకు ప్రయోజనం చేకూరనుంది. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం.. భారత్‌ అమల్లోకి తెచ్చిన 17వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే.

విద్యార్థులు, నిపుణులకూ ప్రయోజనాలు

ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌ సేవల రంగంలో భారతీయులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, వైద్యం, విద్య, ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్లు సహా 118 రంగాల్లో న్యూజిలాండ్‌ అవకాశాలు కల్పించింది. భారతీయ విద్యార్థులు వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) విభాగాల్లో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ పూర్తి చేసినవారికి మూడేళ్ల పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా లభించనుంది. డాక్టరేట్‌ చేసినవారికి నాలుగేళ్ల వీసా సదుపాయం కల్పించారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో గరిష్ఠంగా 5వేల మంది భారతీయ నిపుణులు ఒకేసారి మూడేళ్ల వరకు న్యూజిలాండ్‌లో పనిచేసేందుకు తాత్కాలిక ఉద్యోగ మార్గాన్ని ఈ ఒప్పందం కల్పిస్తోంది. మరోవైపు, ఏటా 1,000 మంది యువ భారతీయులు వర్క్‌ అండ్‌ హాలిడే పథకం కింద 12 నెలలపాటు అక్కడ నివసిస్తూ ప‌ని చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

న్యూజిలాండ్‌ ఉత్పత్తులకూ వెసులుబాటు

ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ తన టారిఫ్‌ లైన్లలో సుమారు 70 శాతంపై రాయితీలు కల్పించనుంది. ఇవి న్యూజిలాండ్‌ ఎగుమతుల్లో దాదాపు 95 శాతానికి వర్తించనున్నాయి. అయితే పాలు, పాల ఉత్పత్తులు, చక్కెర, వంటనూనెలకు రాయితీల నుంచి మినహాయింపు ఇచ్చారు. యాపిల్స్‌, కివీ పండ్లు, మనుకా తేనె వంటి ఉత్పత్తులకు నిర్దిష్ట పరిమాణ పరిమితులు, ఇతర షరతులతో రాయితీలు వర్తిస్తాయి. రెండు దేశాల మధ్య 2025లో వస్తు వాణిజ్యం సుమారు 1.23 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్‌ ఎగుమతులు 651.8 మిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతులు 575.9 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యాన్ని కూడా ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే గత 25 ఏళ్లలో న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు వచ్చిన పెట్టుబడులు ఒక బిలియన్‌ డాలర్‌ కంటే తక్కువేనని జీటీఆర్‌ఐ వెల్లడించింది.

సవాళ్లనూ అధిగమించాలి

సుంకాల తగ్గింపుతోనే ఆశించిన ఫలితాలు రావని జీటీఆర్‌ఐ అభిప్రాయపడింది. ఆహార భద్రతా ప్రమాణాలు, ధ్రువీకరణ ఖర్చులు, అధిక రవాణా వ్యయాలు, ఎక్కువ సమయం పట్టే నౌకాయానం భారత ఎగుమతిదారులకు సవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. సరళమైన నిబంధనలు, మెరుగైన రవాణా అనుసంధానం, విద్యార్హతల గుర్తింపు, వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ఈ ఒప్పందం ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవచ్చని తెలిపింది.

Advertisement
Advertisement