త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BS-VII | వాహ‌నాల‌కు బీఎస్‌-7 నిబంధ‌న‌లు.. కీల‌క మార్పుల‌కు కేంద్రం క‌స‌ర‌త్తు..

BS-VII | భారత్‌లో వాహన కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బీఎస్‌-6 ప్రమాణాల స్థానంలో కొత్తగా ప్రతిపాదించిన భారత్‌ స్టేజ్‌-7 (బీఎస్‌-7) ఉద్గార ప్రమాణాలను దశలవారీగా అమలు చేయాలని రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

S

Automobiles | Published On Oct 17, 2026, 10.45 am IST

BS-VII | వాహ‌నాల‌కు బీఎస్‌-7 నిబంధ‌న‌లు.. కీల‌క మార్పుల‌కు కేంద్రం క‌స‌ర‌త్తు..
Advertisement

BS-VII | భారత్‌లో వాహన కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బీఎస్‌-6 ప్రమాణాల స్థానంలో కొత్తగా ప్రతిపాదించిన భారత్‌ స్టేజ్‌-7 (బీఎస్‌-7) ఉద్గార ప్రమాణాలను దశలవారీగా అమలు చేయాలని రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ నిబంధనల ప్రకారం వాహనాల నుంచి వెలువడే పొగను మాత్రమే కాకుండా, బ్రేకులు, టైర్ల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని కూడా నియంత్రించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ సామర్థ్యం, వాహనాలు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వెలువడే ఉద్గారాలు, కాలక్రమేణా కాలుష్య నియంత్రణ వ్యవస్థల పనితీరుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

ప్రతిపాదనల ప్రకారం ప్రయాణికుల కార్లకు 2029 ఏప్రిల్‌ 1 నుంచి, తేలికపాటి వాణిజ్య వాహనాలకు 2030 ఏప్రిల్‌ నుంచి, బస్సులు, భారీ ట్రక్కులకు 2031 ఏప్రిల్‌ నుంచి కొత్త ప్రమాణాలను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించారు. ఈ ముసాయిదా నోటిఫికేషన్లను తాజాగా ప్రచురించారు. ప్రజలకు నోటిఫికేషన్ల ప్రతులు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 30 రోజుల పాటు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ నిబంధనల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

బీఎస్‌-6 నుంచి బీఎస్‌-7కు ఏం మారనుంది?

భారత్‌లో బీఎస్‌-6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు 2020 ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా నైట్రోజన్‌ ఆక్సైడ్లు, సూక్ష్మ కాలుష్య కణాలు వంటి హానికర ఉద్గారాలపై కఠిన పరిమితులు విధించారు. సంబంధిత వాహనాలకు వాస్తవ డ్రైవింగ్‌ పరిస్థితుల్లో ఉద్గారాల పరీక్షలను కూడా ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత బీఎస్‌-7 ప్రమాణాలు ప్రయోగశాలల్లో నిర్వహించే పరీక్షలకే పరిమితం కాకుండా వాహనాలు రహదారులపై నడుస్తున్నప్పుడు వాటి పనితీరును పరిశీలించనున్నాయి. మరింత చిన్న పరిమాణంలోని కాలుష్య కణాలను కొలవడం, ఉద్గార నియంత్రణ వ్యవస్థలు ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించడం, ఇంధనం లేదా విద్యుత్‌ వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

కార్లకు సంబంధించి కార్బన్‌ మోనాక్సైడ్‌ (సీఓ), నైట్రోజన్‌ ఆక్సైడ్లు (ఎన్‌ఓఎక్స్‌), ఎగ్జాస్ట్‌ ద్వారా వెలువడే సూక్ష్మ కణాలపై ప్రస్తుతం ఉన్న ప్రధాన పరిమితులను ముసాయిదా కొనసాగిస్తోంది. అయితే, కాలుష్యాన్ని కొలిచే విధానం, వాస్తవ పరిస్థితుల్లో పరీక్షలు, బ్రేకులు, టైర్ల నుంచి వెలువడే కణాల నియంత్రణ వంటి అదనపు నిబంధనలను ప్రతిపాదించింది. 2020 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన బీఎస్‌-6తో పోలిస్తే బీఎస్‌-7లో వాహనాల వాస్తవ పనితీరుకు మరింత ప్రాధాన్యం లభించనుంది. ప్రయోగశాలల్లో పరీక్షలు పాసైనంత మాత్రాన సరిపోదు. రహదారులపై ప్రయాణించే సమయంలోనూ వాహనాలు నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

ఎగ్జాస్ట్‌ కాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తారు?

కార్ల నుంచి వెలువడే ప్రధాన కాలుష్య కారకాలైన కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్లు, సూక్ష్మ కణాలపై ముసాయిదా నిర్దిష్ట పరిమితులను కొనసాగిస్తోంది. అయితే సూక్ష్మ కణాల సంఖ్యను లెక్కించే విధానంలో కీలక మార్పును ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 23 నానోమీటర్ల పరిమాణ పరిమితిని 10 నానోమీటర్లకు తగ్గించాలని సూచించింది. దీనివల్ల అంతకంటే చిన్న కాలుష్య కణాలను కూడా కొలిచే విధానంలోకి తీసుకురావచ్చు. ప్రతిపాదిత ప్రమాణాల ప్రకారం పెట్రోల్‌ కార్లు ప్రతి కిలోమీటరుకు గరిష్ఠంగా 1,000 మిల్లీగ్రాముల కార్బన్‌ మోనాక్సైడ్‌, 60 మిల్లీగ్రాముల నైట్రోజన్‌ ఆక్సైడ్లను విడుదల చేయడానికి అనుమతి ఉంటుంది. డీజిల్‌ కార్లకు ఈ పరిమితులు వరుసగా 500 మిల్లీగ్రాములు, 80 మిల్లీగ్రాములుగా ప్రతిపాదించారు. పెట్రోల్‌, డీజిల్‌ కార్లు రెండింటికీ సూక్ష్మ కణాల ఉద్గార పరిమితి ప్రతి కిలోమీటరుకు 4.5 మిల్లీగ్రాములుగా ఉంటుంది.

వాహనాల ఇంధన వ్యవస్థ నుంచి పెట్రోల్‌ ఆవిరి బయటకు వెళ్లకుండా నియంత్రించే నిబంధనలను కూడా ప్రతిపాదించారు. నిర్దేశించిన పరిమితులను మించిన ఉద్గారాలను గుర్తించేందుకు వాహనంలోనే పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. సంబంధిత ఉద్గారాలు నిర్దేశిత పరిమితికి కనీసం 2.5 రెట్లు చేరిన సందర్భాలను సహా గుర్తించగలగాలి. 2032 ఏప్రిల్‌ 1 నుంచి తయారయ్యే వాహనాలకు ఈ పర్యవేక్షణ వ్యవస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని వాహన నిర్ధారణ పోర్టు ద్వారా అందుబాటులో ఉంచాలని ముసాయిదా పేర్కొంది. వాస్తవ రహదారి పరిస్థితుల్లో పరీక్షల కోసం పోర్టబుల్‌ పరికరాలను ఉపయోగించే విధానాన్ని కూడా ప్రతిపాదించారు. 2030 ఏప్రిల్‌ నుంచి వాహనాలకు రకం ఆమోదం ఇచ్చే ప్రక్రియలో భాగంగా రహదారులపై ఉద్గారాల పరీక్షలను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిబంధనల అమలు వాహనాల వర్గాన్ని బట్టి దశలవారీగా సాగనుంది.

బ్రేకులు, టైర్ల కాలుష్యానికి పరిమితులు విధించ‌నున్నారా..?

వాహనాల నుంచి వెలువడే కాలుష్యం అంటే కేవలం ఎగ్జాస్ట్‌ పొగ మాత్రమే కాదు. బ్రేకులు అరిగే సమయంలో సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. టైర్లు రోడ్డుపై తిరుగుతున్నప్పుడు వాటి పదార్థాలు అరిగి కణాల రూపంలో పరిసరాల్లోకి చేరతాయి. ఈ కాలుష్యాన్ని కూడా నియంత్రించేందుకు బీఎస్‌-7 ముసాయిదా కొత్త ప్రమాణాలను ప్రతిపాదించింది. ప్రయాణికుల కార్లకు 2031 ఏప్రిల్‌ నుంచి స్వచ్ఛమైన విద్యుత్‌తో నడిచే కార్లకు ప్రతి కిలోమీటరుకు 3 మిల్లీగ్రాముల బ్రేక్‌ కణాల పరిమితిని, ఇతర నిర్దేశిత వాహన రకాలకు 7 మిల్లీగ్రాముల పరిమితిని ప్రతిపాదించారు. 2035 ఏప్రిల్‌ నుంచి అన్ని రకాల ఇంధన సాంకేతికతలకు ప్రతి కిలోమీటరుకు 3 మిల్లీగ్రాముల ఉమ్మడి పరిమితిని అమలు చేయాలని సూచించారు. టైర్ల అరుగుదల వల్ల ఏర్పడే కాలుష్యానికి సంబంధించి 2031 ఏప్రిల్‌ నుంచి నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే, వాటికి సంబంధించిన క‌చ్చితమైన సంఖ్యాపరమైన పరిమితులను ప్రత్యేకంగా ప్రకటించాల్సి ఉంది.

కార్ల ఇంజిన్లలో మార్పులు తప్పనిసరా?

బీఎస్‌-7 ముసాయిదా నిర్దిష్ట ఇంజిన్‌ రూపకల్పనను తప్పనిసరి చేయడం లేదు. బదులుగా, వాహనాలు పాటించాల్సిన ఉద్గార పరిమితులు, పరీక్షా విధానాలను నిర్దేశిస్తోంది. ఈ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీలు ఎలాంటి సాంకేతిక మార్పులు చేయాలన్నది ఆయా వాహనాల ప్రస్తుత సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వాహనాల్లో సెన్సార్లు, ఇంజిన్‌ నియంత్రణ వ్యవస్థలు, ఎగ్జాస్ట్‌ కాలుష్య శుద్ధి పరికరాలు లేదా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు అవసరమయ్యే అవకాశం ఉంది. తయారీదారులు పరీక్షలు, ఇతర ధ్రువీకరణ ప్రక్రియల ద్వారా తమ వాహనాలు కొత్త ప్రమాణాలను పాటిస్తున్నాయని నిరూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు సంప్రదాయ ఇంజిన్లకే పరిమితం కావు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ వాహనాలకు బ్యాటరీ పనితీరు ప్రమాణాలను ప్రతిపాదించారు. బ్రేకులు, టైర్ల నుంచి వెలువడే కాలుష్య కణాల నియంత్రణకు సంబంధించిన నిబంధనలను కూడా తయారీదారులు పాటించాల్సి ఉంటుంది.

ట్రక్కులు, బస్సులకు ఎప్పటి నుంచి?

చిన్న సరకు రవాణా వాహనాల వంటి తేలికపాటి వాణిజ్య వాహనాలకు 2030 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-7 ప్రమాణాలను అమలు చేయాలని ప్రతిపాదించారు. వీటి బరువు, వాహన వర్గాన్ని బట్టి ఉద్గార పరిమితులు మారుతాయి. ఈ వాహనాలకు బ్రేక్‌ కణాల నియంత్రణ నిబంధనలు 2032 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావాలని సూచించారు. 2035 నుంచి అన్ని రకాల ఇంధన సాంకేతికతలకు ఉమ్మడి పరిమితిని ప్రతిపాదించారు. అయితే, బ్రేక్‌ కణాలకు సంబంధించిన క‌చ్చితమైన సంఖ్యాపరమైన పరిమితులను తర్వాత ప్రకటించనున్నారు. బస్సులు, భారీ ట్రక్కుల కోసం ప్రత్యేక ముసాయిదాను రూపొందించారు. వీటికి 2031 ఏప్రిల్‌ నుంచి కొత్త ప్రమాణాలను తీసుకురావాలని ప్రతిపాదించారు. కార్లతో పోలిస్తే భారీ వాహనాలు అధిక పనిభారంతో పనిచేస్తాయి. అందువల్ల వీటి ఎగ్జాస్ట్‌ ఉద్గార పరిమితులను ప్రయాణించిన దూరం ఆధారంగా కాకుండా, ఇంజిన్‌ ఉత్పత్తి చేసే శక్తి ఆధారంగా కొలుస్తారు. భారీ వాహనాలకు నైట్రోజన్‌ ఆక్సైడ్లు, సూక్ష్మ కణాలతోపాటు అమ్మోనియా, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి వాయువుల ఉద్గారాలపై కూడా పరిమితులను ప్రతిపాదించారు.

ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయనున్నారు. 2031 ఏప్రిల్‌ నుంచి ఎగ్జాస్ట్‌ ఉద్గార పరిమితులు, రహదారులపై పరీక్షలు, వాహనంలోనే పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. 2033 ఏప్రిల్‌ నుంచి అదనపు పర్యవేక్షణ నిబంధనలు, బ్రేక్‌ కణాల నియంత్రణను తీసుకురావాలని సూచించారు. 2035 ఏప్రిల్‌ నుంచి టైర్ల అరుగుదల వల్ల ఏర్పడే కాలుష్య నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావాలని ప్రతిపాదించారు.
బ్రేక్‌ కణాలు, టైర్ల అరుగుదల, బ్యాటరీ పనితీరుకు సంబంధించిన కొన్ని క‌చ్చితమైన పరిమితులను ప్రత్యేకంగా ప్రకటించాల్సి ఉంటుంది. బస్సులు, ట్రక్కుల ఉద్గార నియంత్రణ వ్యవస్థలు ఎంతకాలం సమర్థవంతంగా పనిచేయాలనే అంశంపైనా నిబంధనలు ప్రతిపాదించారు. వాహన వర్గం, బరువును బట్టి ఈ కాలపరిమితులు మారుతాయి. గరిష్ఠంగా 8.75 ల‌క్ష‌ల కిలోమీటర్లు లేదా 15 సంవత్సరాల వరకు ఉద్గార నియంత్రణ సామర్థ్యాన్ని కొనసాగించాల్సిన నిబంధనను ప్రతిపాదించారు.

పాత వాహనాల పరిస్థితి ఏమిటి?

కొత్త బీఎస్‌-7 ప్రమాణాలు నిర్దేశిత తేదీల నుంచి తయారయ్యే వాహనాలకు వర్తించే ఉద్గార, పరీక్షా నిబంధనలను నిర్దేశిస్తున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఉన్న బీఎస్‌-6 కార్లను తప్పనిసరిగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం లేదా వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయించడం కోసం దేశవ్యాప్త కార్యక్రమాన్ని ఈ ముసాయిదా ప్రతిపాదించడం లేదు. అయితే, కొత్త నిబంధనల పరిధిలోకి వచ్చే ప్రయాణికుల కార్లు వాటి జీవితకాలంలోనూ ఉద్గార ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ప్రధాన కాలపరిమితి 1.60 ల‌క్ష‌ల కిలోమీటర్లు లేదా ఎనిమిదేళ్లు, ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటి వరకు ఉంటుంది. ఆ తర్వాత అదనపు కాలపరిమితి 2 ల‌క్ష‌ల కిలోమీటర్లు లేదా పదేళ్ల వరకు ప్రతిపాదించారు.

ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీలకు కొత్త నిబంధనలు ఏమిటి..?

ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ వాహనాల బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించి బీఎస్‌-7 ముసాయిదా కీలక ప్రమాణాలను ప్రతిపాదించింది. బ్యాటరీలు నిర్దిష్ట కాలం తర్వాత కూడా ఎంత విద్యుత్‌ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే అంశాన్ని ఇందులో పేర్కొన్నారు. ప్రతిపాదన ప్రకారం ఐదేళ్లు లేదా 1 ల‌క్ష కిలోమీటర్ల ప్రయాణం పూర్తయ్యే సమయానికి బ్యాటరీ తన అసలు విద్యుత్‌ నిల్వ సామర్థ్యంలో కనీసం 75 శాతాన్ని నిలుపుకోవాలి. ఎనిమిదేళ్లు లేదా 1.60 ల‌క్ష‌ల కిలోమీటర్ల ప్రయాణం పూర్తయ్యే సమయానికి కనీసం 67 శాతం సామర్థ్యాన్ని కొనసాగించాలి. ఈ రెండు దశల్లోనూ నిర్దేశించిన కాలం, ప్రయాణ దూరంలో ఏది ముందుగా పూర్తయితే దానిని ప్రాతిపదికగా తీసుకుంటారు.

అయితే, బ్యాటరీ మన్నికను అంచనా వేసేందుకు అవసరమైన కనీస పనితీరు ప్రమాణాలు, పరీక్షా విధానాలను ప్రత్యేకంగా ప్రకటించాల్సి ఉంది. వాహనాల వినియోగదారులకు తాజా సమాచారాన్ని అందించేందుకు ఎన్విరాన్‌మెంటల్‌ వెహికల్‌ పాస్‌పోర్ట్‌ అనే వ్యవస్థను కూడా ప్రతిపాదించారు. దీని ద్వారా ఇంధన వినియోగం, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ ఆరోగ్యం, కాలుష్య ఉద్గారాలు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. వాహనంలో అమర్చిన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా సేకరించిన సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరచనున్నారు. ఈ పాస్‌పోర్ట్‌ను వాహనం లోపల ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని ముసాయిదా సూచిస్తోంది.

బీఎస్‌-7పై వాహన తయారీదారుల అభ్యంతరాలేమిటి?

ప్రతిపాదిత బీఎస్‌-7 ఉద్గార ప్రమాణాల అమలును మరింత ఆలస్యం చేయాలని, దశలవారీ అమలును 2032, 2035 సంవత్సరాలకు మార్చాలని వాహన తయారీ సంస్థలు కోరేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త సాంకేతిక మార్పులు చేపట్టడానికి అవసరమైన సమయం తక్కువగా ఉందని, నిర్దేశించిన గడువులో ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయడం సవాలుగా మారుతుందని కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. కొత్త నిబంధనల వల్ల వాహనాల రూపకల్పన, పరీక్షలు, ధ్రువీకరణ, ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వాహనాల విడుదల షెడ్యూళ్లపైనా ప్రభావం పడుతుంది. బీఎస్‌-7 ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయడానికి ఇంజినీరింగ్‌ వనరులను కేటాయిస్తే, ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధికి ఉపయోగించే వనరులు తగ్గే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

బీఎస్‌-7 ప్రతిపాదనలు వాహన కాలుష్య నియంత్రణను ఎగ్జాస్ట్‌ పొగకే పరిమితం చేయకుండా, బ్రేకులు, టైర్లు, బ్యాటరీ పనితీరు, వాస్తవ రహదారి పరిస్థితుల్లో వాహనాల ఉద్గారాల వరకు విస్తరించనున్నాయి. అయితే, ఇవి ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదనలు మాత్రమే. ప్రజాభిప్రాయాల స్వీకరణ, తుది నిబంధనల ప్రకటన తర్వాతే అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

Advertisement
Advertisement