త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్‌కు తిప్పలు

Balka Suman | హింసాత్మక చర్యలు ప్రేరేపించేలా సుమన్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. తప్పు జరిగిపోయిందని ఆలస్యంగా గ్రహించింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మీటింగ్ ముగిసి గంటలు గడిచిపోయినా.. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పెద్దలకూ పెద్దగా తెలియకపోవడం గమనార్హం.

S

Telangana | Published On May 27, 2026, 4.08 pm IST

Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్‌కు తిప్పలు
Advertisement

సింగరేణి ఆఫీసులను తగలబెట్టాలంటూ వ్యాఖ్యలు
మిలిటెంట్ పోరాటం చేయాలంటూ పిలుపు
కేటీఆర్ సన్నిహితుడిగా సుమన్‌కు ముద్ర
తెలంగాణ ఉద్యమ సమయంలో
కేసీఆర్ ఎన్నడూ ఇలా రెచ్చగొట్టలేదని
గుర్తు చేస్తున్న విద్యావంతులు
డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

Balka Suman | త్రినేత్ర న్యూస్ : ముచ్చ‌ట్లు చెప్పుడు కాదు.. మీటింగ్‌లు పెట్టుడు కాదు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. . సోష‌ల్ మీడియా, ప్రెస్‌మీట్లు కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. సింగరేణి జీఎంగానీ ఆఫీసు కాల‌బెడుదం.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం. కార్మికులు మ‌న‌ల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్లు మా కోసం కొట్లాడుతున్న‌రు.. కేసులు అయితున్న‌యి, లాఠీ ఛార్జీలు అయితున్న‌య‌ని, జైళ్లో పెట్టార‌ని మ‌న నాయ‌క‌త్వం మీద న‌మ్మ‌కం రావాలి. మ‌న ద‌గ్గ‌ర అన్నీ రైల్వే లైన్లు ఉన్నాయి. ఒక రోజు రైల్ రోకో అని పెట్టి రైల్వే లైన్లు కోసి పారేయండి. సీరియ‌స్‌గా చెబుతున్నా.. సీరియ‌స్‌గా తీసుకోక‌పోతే.. కార్మిక‌వ‌ర్గం మ‌న దిక్కు తిరిగి చూడ‌రు. గ‌ట్టిగా చేయ‌లే.. నెల రోజులు జైలుకు పోయిరండి. గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చిన‌ట్టు ఫీల్ కావాలి.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

రైలుపట్టాలు కోసేయండి. సింగరేణి ఆఫీసులను తగులబెట్టండి. మిలిటెంట్ పోరాటాలు చేయండి.. అంటూ బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. హింసకు దారి తీసేలా, యువతను రెచ్చగొట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ పార్టీలు, ఇటు సోషల్ మీడియా తీవ్రంగా స్పందించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతా రహితంగా ఉన్నాయంటూ విమర్శల దాడి మొదలైంది.

ఇరకాటంలో బీఆర్ఎస్

హింసాత్మక చర్యలు ప్రేరేపించేలా సుమన్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. తప్పు జరిగిపోయిందని ఆలస్యంగా గ్రహించింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మీటింగ్ ముగిసి గంటలు గడిచిపోయినా.. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పెద్దలకూ పెద్దగా తెలియకపోవడం గమనార్హం. మే 26న బీఆర్ఎస్ లైవ్ ఫీడ్ యూట్యూబ్ చానల్ నుంచి సుమన్ వ్యాఖ్యలను తొలగించింది.

కేసీఆర్.. ఎన్నడూ ఇలా అనలేదే..

2001లో జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ సాకారమయ్యేవరకు 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నడూ.. హింసాత్మక చర్యలకు పిలుపునివ్వలేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలే గుర్తు చేస్తున్నాయి. విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టే ప్రకటనలు ఏనాడూ ఆయన చేయలేదని ఉద్యమ నేతలు నాటి సన్నివేశాలను నెమరువేసుకుంటున్నారు. రైల్ రోకో, సడక్ బంద్, రోడ్లపై వంటావార్పు వంటి ప్రజాస్వామ్య పోరాటాలకు పిలుపునిచ్చారే తప్ప.. ఏనాడూ హింసకు తావిచ్చేలా పిలుపునివ్వలేని చెబుతున్నారు.

కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు

రాజకీయాల్లో యువకుడైన బాల్క సుమన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బాగా సన్నిహితుడని చెబుతారు. కేటీఆర్ టీమ్‌లో ముఖ్యమైన వ్యక్తిగా బీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తాయి. అయితే, మే 26న తెలంగాణ భవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో చేసిన మిలిటెంట్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదం అయ్యాయి. జనం మద్దతు కూడగట్టాలంటే జైలుకెళ్లే పనులు చేయాలంటూ ఆవేశంగా బాల్క సుమన్ పిలుపునిచ్చినా.. ఆ వ్యాఖ్యలు కేటీఆరే చేయించి ఉండొచ్చని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో.. జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్‌కు సుమన్ అదనంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యల తలనొప్పి తీసుకొచ్చి పెట్టినట్లైంది.

తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్

సుమన్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల్లో ఓడిపోగానే బాల్క సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారంటూ విమర్శించింది. ప్ర‌భుత్వ విప్‌లు బ‌ల్మూరి వెంక‌ట్, అద్దంకి ద‌యాక‌ర్‌.. డీజీపీ సీవీ ఆనంద్‌ను క‌లిసి సుమన్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో బాల్క సుమ‌న్‌పై నాంప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

కాలుస్తా.. న‌రుకుతా.. అన్నవారిపై కేసులు పెట్ట‌రా..?

అయితే తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ సుమన్ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను కార్మికులు, రైతుల ఆక్రోశం, ఆవేదనపై స్పందిస్తూ మాట్లాడానని బాల్క సుమ‌న్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యేపై కేసు పెట్టారా..? నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్‌పై కేసులు పెట్టారా..? నిజంగా కేసులు పెట్టాలంటే సీఎంతో సహా అందరిపై కేసులు పెట్టాలి. ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు.. మరి వారిపై పెట్టని కేసులు.. నాపై ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు.

జై తెలంగాణ నినాదంతో...

మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకాన్ని ఉర్రూతలూగించిన బాల్క సుమన్ గురించి తెలియని వారు ఉండరు. 2007 ఫిబ్రవరి 1న ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో.. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముఖ్య అతిథిగా హాజరైన 77వ స్నాతకోత్సవంలో జై తెలంగాణ ప్లకార్డుతో నినదించి బాల్క సుమన్ వార్తల్లోకెక్కారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నిప్పును బలోపేతం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఎంపీగా, 2018లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో వివేక్ చేతిలో ఓడిపోయారు.

Advertisement
Advertisement