త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మార్కెట్లు మళ్లీ జోష్‌లో.. సెన్సెక్స్ 389 పాయింట్లు పైకి..

Stock Markets | మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పరిస్థితులను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ట్రేడయ్యాయి. రియాల్టీ, ఫైనాన్షియల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రధాన సూచీలు పాజిటివ్ జోన్‌లో కొనసాగాయి.

S

Business | Published On Jun 9, 2026, 10.16 am IST

Stock Markets | మార్కెట్లు మళ్లీ జోష్‌లో.. సెన్సెక్స్ 389 పాయింట్లు పైకి..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పరిస్థితులను ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ట్రేడయ్యాయి. రియాల్టీ, ఫైనాన్షియల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రధాన సూచీలు పాజిటివ్ జోన్‌లో కొనసాగాయి. ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 389.24 పాయింట్లు (0.53 శాతం) పెరిగి 73,913.50 వద్ద ట్రేడవ‌గా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 115.80 పాయింట్లు (0.50 శాతం) ఎగిసి 23,238.80 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ50లో ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో నిలిచాయి.

విస్తృత మార్కెట్ల‌లోనూ..

విస్తృత మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.83 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.63 శాతం మేర లాభపడ్డాయి. దీంతో మార్కెట్‌లో పెట్టుబడిదారుల నమ్మకం కొంత మేర పెరిగింద‌ని తెలుస్తోంది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ సూచీలు విస్తృత మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. అయితే నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడవుతూ అత్యంత బలహీన రంగ సూచీగా నిలిచింది. కాగా సోమవారం వాల్ స్ట్రీట్ మిశ్రమ ధోరణితో ముగిసింది. టెక్నాలజీ, గ్రోత్ స్టాక్స్ పుంజుకుని ఇటీవల నమోదైన నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి రికవర్ చేసుకున్నాయి. అయితే సంప్రదాయ సైక్లికల్ రంగాల షేర్లు బలహీనతను ప్రదర్శించాయి. ముఖ్యంగా సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన షేర్లలో కొనుగోళ్లు పెరగడం అమెరికా మార్కెట్లకు మద్దతుగా నిలిచిందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌పడ్డ రూపాయి..

కాగా సోమవారం భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 719 పాయింట్లు క్షీణించి 73,524.26 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 కూడా 243 పాయింట్లు పడిపోయి 23,123 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు రెండు నెలల కనిష్ట ముగింపు స్థాయిగా నమోదైంది. పశ్చిమ ఆసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పటికీ ఇన్వెస్టర్ల భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేసినప్పటికీ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగితే తిరిగి ప్రతిస్పందించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన అనిశ్చిత పరిస్థితులపై కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా దృష్టి సారిస్తున్నాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.63 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 92.44 వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.95 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 88.64 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 6 పైస‌లు బ‌ల‌ప‌డ్డ రూపాయి 95.62 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement